ఢిల్లీలో తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి (Mallu Ravi) ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలో తనను తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తనను తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన ఏఐసీసీ పెద్దలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ….. తనకు ఉద్యోగం వచ్చినట్లు అనుకోవడం లేదని వెల్లడించారు. ఇది తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా ఉంటానని తెలిపారు.
రాష్ట్రానికి చెందిన పలు అంశాలు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. సైనిక్ స్కూల్, కంటోన్మెంట్ వద్ద రక్షణ శాఖ భూములు సహా నీటి ప్రాజెక్టులు, ఆర్థిక, రక్షణ శాఖకు చెందిన పలు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారానికి తనవంతు కృషొ చేస్తానన్నారు.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 15 అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞాపనలు అందజేశారని వివరించారు. సమాఖ్య స్పూర్తిలో భాగంగా రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని ఈ సందర్బంగా కోరారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో నాలుగేళ్లు ప్రత్యేక ప్రతినిధిగా పని చేసిన అనుభవం తనకు ఉందని గుర్తు చేశారు. అందుకే ప్రత్యేక ప్రతినిధిగా తనకు బాధ్యతలు ఇచ్చారన్నారు.