విమానంలో (Fliht) మహిళా ప్రయాణికురాలి పట్ల లైంగిక వేధింపుల ఘటన మరొకటి వెలుగు చూసింది. ఇండిగో (Indigo) విమానంలో ఇది చోటు చేసుకుంది. ముంబై(Mumbai) నుంచి గువాహటికి (Guvahati) శనివారం రాత్రి ప్రయాణించే సమయంలో.. క్యాబిన్ లైట్లు డిమ్ అయిన తర్వాత.. ఓ వ్యక్తి తన పక్క సీట్లో కూర్చున్న ప్రయాణికురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. చేయి పెట్టుకోవడానికి ఉండే రెస్ట్ హ్యాండిల్ ను పైకి తోసేసి.. చేతితో మహిళ శరీరాన్ని తడిమాడు.
దీనిపై బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు ప్రయాణికుడిని గువాహటిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను ఇండిగో ప్రకటించింది. గడిచిన రెండు నెలల కాలంలో విమానంలో లైంగిక వేధింపుల ఘటనలు మొత్తం మీద ఐదు చోటు చేసుకున్నాయి. దీనిపై బాధితురాలు తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు.
శనివారం రాత్రి 9 గంటల తర్వాత ముంబై నుంచి గువాహటికి విమానం బయల్దేరిన తర్వాత.. విండో పక్క సీటులో కూర్చున్న మహిళ రెండు సీట్ల మధ్యలోని రెస్ట్ హ్యాండిల్ ను కిందకు దించి పడుకునే ప్రయత్నం చేసింది. ఇంతలో పక్క సీట్లో కూర్చున్న పురుష ప్రయాణికుడు హ్యాండిల్ ను పైకి ఎత్తడంతో ఆమె నిద్ర లేచి, మళ్లీ దాన్ని కిందకు డౌన్ చేసి తన సీటులో వెనక్కి వాలి నిద్రించింది.
ఇంతలో ఆ ప్రయాణికుడు ఆమె నిద్రించిందని భావించి.. చేయి వేసి తడుముతుండడంతో, ఒక్కసారిగా ఆమె కళ్లు తెరిచి లైట్లు ఆన్ చేసి అరవడం ప్రారంభించింది. జరిగిన ఘటన గురించి క్యాబిన్ సిబ్బందికి వెల్లడించింది. విమానం గువాహటి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. సదరు మహిళ విమానం సిబ్బందికి, సీఐఎస్ఎఫ్ కు ధన్యవాదాలు తెలియజేసింది.