తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ (Mansoor Ali Khan)కు భారీ షాక్ తగిలింది. నటి త్రిష (Trisha), ఖుష్బూ (Khushboo), మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)లపై అలీఖాన్ దాఖలు చేసిన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. అలీఖాన్ దాఖలు చేసిన పిటిషన్ ను ‘పబ్లిసిటీ స్టంట్’గా హైకోర్టు అభివర్ణించింది. అందుకే పిటిషన్ ను కొట్టి వేస్తున్నట్టు తెలిపింది. దీంతో పాటు అలీఖాన్ కు రూ. 1లక్ష జరిమానాను విధించింది.
జరిమానా మొత్తాన్ని చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో జమ చేయాలని ఆదేశించింది. అంతకు ముందు డిసెంబర్ 12న అలీఖాన్ పై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిషపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను మన్సూర్ అలీఖాన్ ను జస్టిస్ ఎన్. సతీష్ కుమార్ మందలించారు. నటీనటులను ప్రజలు ఒక రోల్ మోడల్‌గా చూస్తారని న్యాయమూర్తి అన్నారు. అందువల్ల పబ్లిక్‌లో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలని మన్సూర్ కు సూచించారు.
ఇటీవల లియో సినిమాలో మన్సూర్ అలీఖాన్, త్రిష జంటగా నటించారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మన్సూర్ మాట్లాడుతూ…. గతంలో తాను చాలా సినిమాల్లో అత్యాచార సన్నివేశాల్లో నటించానని చెప్పారు. ఇటీవల ‘లియో’లో ఛాన్స్ వచ్చినప్పుడు కూడా త్రిషతో అలాంటి సీన్ ఉంటుందని తాను అనుకున్నానని కామెంట్స్ చేశారు. కానీ అలాంటి సీన్ లేకపోవడం తనకు బాధ కలిగించిందన్నారు.
ఆ వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా త్రిష తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ తర్వాత త్రిషకు మద్దతుగా ‘లియో’ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, మెగా స్టార్ చిరంజీవి, నితిన్, రోజా, రాధిక, సింగర్ చిన్మయి వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలపై మన్సూర్ వివరణ ఇచ్చారు. త్రిషపై తనకు చాలా మంచి అభిప్రాయం ఉందన్నారు. తాను సరదాగా చేసిన ఇంతటి దుమారం రేగుతుందని తాను అనుకోలేదన్నారు.
ఈ వివాదం నేపథ్యంలో మన్సూర్ అలీఖాన్ పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో గతనెలలో త్రిషకు మన్సూర్ క్షమాపణలు చెప్పారు. కానీ తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ త్రిష, ఖుష్బు, చిరంజీవిలపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. మొత్తం కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. తాజాగా ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది.