దేశంలో నిత్యావసర సరకుల (Essential Commodities) ధరలపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ద్రవ్యోల్బణం (Inflation) పై తీవ్ర ఆందోళనలు కొనసాగుతోన్నాయని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నిరంతర పెరుగుదల కారణంగా కోట్లాది కుటుంబాలు “నిజమైన కష్టాలను” ఎదుర్కొంటున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు
ఆర్బీఐ రెపో రేటు (వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై విధించే వడ్డీ)ను 6.5 శాతంగా కొనసాగించిందన్నారు. దీన్ని బట్టి దేశంలో ద్రవ్యోల్బణ ఆందోళనలు తీవ్రంగా ఉన్నాయని అర్థమవుతోందన్నారు. గత 47 నెలలుగా వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆర్బీఐ మధ్య కాలిక లక్ష్యం 4 శాతం కన్నా ఎక్కువగానే ఉంటోదని పేర్కొన్నారు.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల కోట్లాది కుటుంబాలు ఎదుర్కొంటున్న నిజమైన కష్టాలను ఈ నివేదిక స్పష్టంగా వివరిస్తోందన్నారు. ద్వై మాసిక ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు.
ఇక రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉందని, వచ్చే ఏడాది నాటికి అది 5.2 శాతానికి తగ్గవచ్చని ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. కానీ 2 శాతం అటు ఇటుగా మార్జిన్ తో వినియోగదారుల సూచీని 4 శాతం వద్ద ఉంచాలని ఆర్బీఐని కేంద్రం ఆదేశించింది. కూరగాయలు, గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గడం వంటివి టర్మ్ ద్రవ్యోల్బణంలో తగ్గుదలకు సహాయపడతాయని శక్తి కాంత దాస్ అన్నారు.