భారత స్వాతంత్ర పోరాట సమయంలో జరిగిన ఎన్నో ఘటనలు మనకు స్పూర్తిని ఇస్తాయి. మనలో పోరాట గుణాన్ని పెంచుతాయి. అలాంటి ఘటనల్లో వెల్లలూరు (Vellaloor) ఘటన ఒకటి. ఇక్కడ గ్రామస్తులంతా బ్రిటీష్ (British) పాలనకు వ్యతిరేకంగా పిడికిలి బిగించారు. ప్రాణాలు పోయినా సరే పన్నులు కట్టేది లేదని తెగేసి చెప్పారు. బ్రిటీష్ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసి వలస పాలకుల కర్కశత్వానికి బలైపోయారు.
తమిళనాడులోని మధురై జిల్లా వెల్లలూరులోని కలాన్ వంశానికి చెందిన రైతులంతా బ్రిటీష్ పాలకులకు ఎదురు తిరిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పన్నులు కట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో బ్రిటీష్ పాలకులు ఆగ్రహించారు. ఎలాగైనా ఉద్యమాన్ని అణచి వేయాలనుకున్నారు. తిరుగుబాటు నాయకులంతా రిరుంబూరు గ్రామంలోని కోవికుడి ఆలయంలో తలదాచుకున్న విషయాన్ని తెలుసుకున్నారు.
ఆలయం వద్దకు కల్నల్ హెరాన్ ఆధ్వర్యంలో సేనలను పంపించారు. హెరాన్ సేనలు ఆలయాన్ని తగులబెట్టి అందులోని విగ్రహాన్ని తీసుకు వచ్చారు. రూ. 5,000 చెల్లిస్తేనే ఆ విగ్రహాన్ని తిరిగి ఇస్తామని కల్నల్ హెరాన్ తేల్చి చెప్పారు. గ్రామస్తులు ఆ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆ విగ్రహాన్ని కరిగించి వేశారు.
కల్నల్ హెరాన్ చర్యలు ఈస్టిండియా కంపెనీకి నచ్చలేదు. దీంతో ఆయన స్థానంలో కెప్టెన్ రమ్లీని నియమించారు. రమ్లీ తన సేనలతో కలిసి గ్రామానికి వెల్లి పన్నులు చెల్లించాలని ఆదేశించాడు. కానీ గ్రామస్తులు ఆ ఆజ్ఞను ధిక్కరించారు. దీంతో ఆ గ్రామాన్ని మొత్తానికి నిప్పంటించాలని తన సేనలను రమ్లి ఆదేశించాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించే వారిని కాల్చి వేయాలని తన సేనలకు ఆదేశాలు జారీ చేశాడు.
1767 నాటి మద్రాసు ప్రభుత్వ అధికారిక గెజిట్ లో ఈ మారణకాండ గురించి నమోదైంది. కానీ ఏ చరిత్ర పుస్తకాల్లో ఈ మారణ హోమం గురించి ప్రస్తావించక పోవడం శోచనీయం. స్వతంత్ర్య పోరాటంలో జలియన్ వాలా బాగ్ ను మించిన ఊచకోత ఘటనలు ఎన్నో జరిగినా అవి చరిత్రకారులకు కనిపించక పోవడం బాధాకరం.