దక్షిణాఫ్రికాలోని (South Africa) అతిపెద్ద నగరమైన జోహన్నెస్‌బర్గ్‌లోని బహుళ అంతస్తుల భవనంలో భారీగా మంటలు (Fire Accident) చెలరేగాయి. గురువారం తెల్లవారు జామున చెలరేగిన ఈ ప్రమాదంలో 63మంది సజీవదహనమయ్యారు. సుమారు మరో 43 మందికి గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.
అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే పెద్దఎత్తున మంటల వ్యాపించడంతో మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు. జోహన్నెస్‌బర్గ్‌లోని ప్రముఖ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఓ భవనంలో ఈ మంటలు చెలరేగాయి. ఈ భవనంలో సుమారు 200 మంది నివాసం ఉంటున్నారని తెలిసింది. తెల్లవారు జామున అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ కారణంగా మృతుల సంఖ్య పెరిగిందని స్థానికులు చెప్పారు.
మంటల చెలరేగిన కొద్దిసేపటికి అగ్నిప్రమాపక సిబ్బంది ఘటన స్థలంకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు అదుపులోకి వచ్చాయని, భవనం మొత్తం దట్టమైన పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలు చేపట్టలేక పోతున్నామని అధికారులు తెలిపారు. మరికొందరు భవనంలో చిక్కుకొని ఉంటారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.
జోహన్నెస్‌బర్గ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రతినిధి రాబర్ట్ ములౌడ్జీ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంలో 63 మంది మరణించారని, 43 గాయపడినట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గాయపడిన వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ములాడ్జి చెప్పారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొనే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.