షహీద్ మౌలావీ అహ్మదుల్లా షా (Shaheed Maulavi Ahmadullah Shah)… యూపీలోని ఫైజాబాద్ కేంద్రంగా బ్రిటీష్ సైన్యంపై విరుచుకు పడిన గొప్ప పోరాట యోధుడు. హిందూ ముస్లింలను ఏకం చేసి బ్రిటీష్ వారిపై యుద్దం చేసిన గొప్ప వీరుడు. ఢంకా మోగిస్తూ ప్రజలను ఉద్యమం వైపు పురిగొల్పి ఢంకా సింగ్ (Danka Shah)గా గుర్తింపు పొందిన వ్యక్తి. 1857 మొదటి స్వతంత్ర పోరాటంలో లైట్ హౌస్ రెబిలియన్ (తిరుగుబాటు లైట్ హౌస్)గా ఆయన్ని పిలిచే వారంటేనే ఆయన పోరాటం ఎలాంటిదో మనకు అర్థం అవుతుంది.
1787లో అహ్మదుల్లా షా జన్మించారు. హైదరాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తర్వాత మత గురువు ఫర్హాన్ అలీ షా వద్ద శిష్యుడిగా చేరారు. ఫర్హాన్ అలీ సూచనల మేరకు గ్వాలియర్ ప్రాంతంలో సూఫీ సిద్దాంతాలను ప్రచారం చేసేందుకు మౌలావీ అహ్మదుల్లా షా వెళ్లారు. ప్రచార సమయంలో బ్రిటీష్ వారి దురాగతాలను కళ్లారా చూసి వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.
హిందూ ముస్లింలను ఏకం చేసి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసేలా ప్రజలను ఆయన ప్రేరేపించారు. నానాసాహెబ్, ఖాన్ బహదూర్ ఖాన్ లతో కలిసి సిపాయిలో తిరుగుబాటులో పాల్గొన్నారు. రష్యా, ఇరాక్, మక్కా ప్రాంతాలకు వెళ్లి అక్కడ యుద్ద విద్యలను నేర్చుకున్నారు. భారత్ కు తిరిగి వచ్చాక ‘కరపత్రాలు’పంచి పెడుతూ ప్రజలను స్వతంత్ర పోరాటం వైపు మళ్లించారు.
ఈ క్రమంలో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలపై ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం ఆయనకు మరణ శిక్ష విధించారు. ఆయన శిక్షను ఆ తర్వాత జీవిత ఖైదుగా మార్చారు. సిపాయిల తిరుగుబాటు ప్రారంభం కావడంతో ఆయన్ని భారతీయ సిపాయిలు జైలు నుంచి తప్పించారు. అక్కడి నుంచి అవధ్ కు వెళ్లి భారతీయ సిపాయిలతో కలిసి హెన్నీ మోంట్ గో మెర్రీ సేనలను ఓడించారు.
ఓటమిని జీర్ణించుకోలేకపోయిన బ్రిటీష్ సైన్యం ఆయన్ని ఎలాగైనా హతమార్చాలని భావించింది. అహ్మదుల్లా షాను పట్టించిన వారికి రూ. 50000ల నజరానా ప్రకటించారు. రాజా జగన్నాథ్ సింగ్ కపట ఉపాయంతొ అహ్మదుల్లాను పట్టుకున్నాడు. అహ్మదుల్లా షా తలను నరికి బ్రిటీష్ వారికి అందించి రూ. 50000 బహుమతిని అందుకున్నారు. ఆ తలను బ్రిటీష్ అధికారులు కోట్వాలీలో బహిరంగంగా వేలాడదీశారు.