కెనడా (Canada) కు భారత్ ‘స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తమ దేశంలో భారత దౌత్య వేత్తను బహిష్కరిస్తున్నట్టు నిన్న కెనడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ (India) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో కెనడాకు చెందిన సీనియర్ దౌత్య వేత్త (Canadian High comissioner) కెమరూన్ మెక్ కే ను బహిష్కరిస్తున్నట్టు భారత్ ప్రకటించింది. ఐదు రోజుల్లోగా భారత్ విడిచి పోవాలని ఆ దౌత్యవేత్తకు సూచించింది.
ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. కెనడాలో ఖలిస్తాన్ నేత హర్దీప్ సింగ్ నిజార్ ను భారత్ హత్య చేయించిందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. కెనడా గడ్డపై ఆ దేశ పౌరున్ని చంపడంలో విదేశీ ప్రమేయం తమ సార్వభౌమత్వానికి ఆమోద యోగ్యం కాని ఉల్లంఘన అని ట్రూడో అన్నారు. ఇది స్వేచ్ఛా, ప్రజాస్వామ్య సమాజాలు తమను తాము నిర్వహించుకునే ప్రాథమిక నియమాలకు విరుద్దమని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. కెనడా ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపింది. ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా ఆశ్రయం కల్పిస్తోందని భారత్ ఆరోపించింది. ఈ విషయంపై నుంచి ఇతర దేశాల దృష్టిని మరల్చేందుకు కెనడా ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. భారత ప్రాదేశిక సమగ్రతకు ముప్పును కలిగించేలా వ్యవహరిస్తోందని తెలిపింది.
అంతకు ముందు కెనడాలోని భారత దౌత్య వేత్తను కెనడా బహిష్కరించింది. కెనడా ప్రధాని వ్యాఖ్యలపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ పై కెనడా ప్రధాని వ్యాఖ్యలు ఆందోళనలు కల్గిస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు వైట్ హౌస్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి అడ్రియానా వాట్స్ వెల్లడించారు.