తెలంగాణలో అతి పెద్ద జాతర, తెలంగాణ కుంభమేళా మేడారం (Medaram) సమ్మక్క సారక్క జాతర అని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సారిగా ఈ జాతరను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని సూచించారు. మేడారం జాతర ఏర్పాట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ. 75 కోట్లు మంజూరు చేశారని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా దేవతలను ఉచితంగా దర్శనం చేసుకునే కేవలం మేడారంలోనే ఉంటుందన్నారు. అధికారులంతా సమన్వయంతో పని చేసి జాతర పనులు పూర్తి చేయాలని సూచించారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించారు. జాతీయ హోదా కల్పించాలని రాష్ట్రపతిని కూడా కోరామని వివరించారు.
జాతీయ హోదా లభిస్తే దేశ వ్యాప్తంగా జాతరకు మంచి గుర్తింపు వస్తుందని ఆమె పేర్కొన్నారు. జాతరలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ నెల చివర వరకు జాతర పనులను పూర్తి చేస్తామన్నారు. పనుల విషయంలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని కోరారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్ర స్థాయిలో జాతరపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. జాతర జరిగే తేదీల్లో మరొకసారి పోస్టర్లు విడుదల చేస్తామన్నారు. జాతర తేదీలను మీడియా, సామాజిక మాద్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. జాతరకు ప్రజాప్రతినిధులు, మంత్రులు, వీఐపీలు ప్రత్యేక ఆహ్వానం పంపి వారిని ఆహ్వానిస్తామన్నారు.