మేడారం జాతర(Medaram Jatara)కు వెళ్లే వారికి అధికారులు కీలక సూచనలు చేశారు. జాతరలో బెల్లం కొనుగోలు చేసే వారి నుంచి ఆధార్ కార్డు(Adhar Card) జిరాక్స్ తప్పనిసరిగా తీసుకోవాలని ఎక్సెజ్ శాఖ నిబంధనలు అమలు చేసింది. బెల్లం దందా జోరుగా సాగుతున్నందునే ఎక్సెజ్ శాఖ ఆంక్షలు విధించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆధార్ కార్డుతో పాటు బెల్లం కొనుగోలుదారులు ఫోన్ నంబర్, ఇంటి చిరునామా, బెల్లం ఎందుకు కొనుగోలు చేస్తున్నారో తెలిపే పూర్తి వివరాలతో ప్రతీరోజు జిల్లా అధికారులకు నివేదిక పంపాలని ఆదేశించారు. మేడారం సమ్మక్క-సారలమ్మకు భక్తులు సమర్పించే బంగారం(బెల్లం)పై ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పించాలనే నిబంధన ఎత్తివేయాలని ములుగు జిల్లా సామాజికవేత్త సుతారి సతీష్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు జిల్లా అధికారుల నుంచి బెల్లం వ్యాపారులకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, మేడారం జాతర నేపథ్యంలో బెల్లం పక్కదారి పట్టే అవకాశముంది. దీంతో ఎక్సైజ్ శాఖ బెల్లం విక్రయాలపై నిఘా పెట్టినట్లు సమాచారం. జాతర సమీపిస్తుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దఎత్తున బెల్లం తెప్పించి ఎక్కడికక్కడ హోల్ సేల్ దుకాణాలు ఏర్పాటు చేశారు.
అక్కడి నుంచి సమ్మక్క మొక్కులకు అధిక బంగారంగా కొంత బెల్లం, గుడుంబా తయారీకి కొందరికి సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల పలుచోట్ల బెల్లం పట్టుబడింది. జనవరి 9న దత్తపల్లిలో 30క్వింటాళ్ల బెల్లం, 50కిలోల పటికను, 10న మరిపెడ మండల కేంద్రంలో 17క్వింటాళ్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. జనవరి 23న నర్సింహులపేట మండలం వంతడపాల స్టేజీ వద్ద కూడా 20 క్వింటాళ్ల బెల్లం పట్టుబడింది.
అదేవిధంగా డిసెంబర్ 25న నర్సంపేట-నెక్కొండ రహదారిలోని అమీన్ పేట వద్ద 15 క్వింటాళ్ల బెల్లంను పోలీసులు పట్టుకున్నారు. మరోవైపు మేడారం జాతర సందర్భంగా నెలకు 40 నుంచి 50 టన్నుల వ్యాపారం జరుగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి ఇక్కడికి ఎక్కువగా బెల్లం రవాణా చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు మేడారం జాతర పేరుతో దాదాపు వెయ్యి టన్నుల బెల్లం వ్యాపారం సాగుతున్నట్లు అంచనా.