పద్మ అవార్డు (Padma Awards)గ్రహీతలను తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీకి చెందిన ఒక్కరికి ఈ అవార్డులు లభించాయి. తాజాగా శిల్ప కళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ అవార్డు గ్రహీతలను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులు సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిని ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ….. పద్మ అవార్డులు ప్రకటించిన వెంటనే సన్మానం చేయడం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు. అవార్డు ప్రకటన కంటే తనకు ఈ సత్కారం మరింత ఆనందాన్ని ఇచ్చిందని వెల్లడించారు.
స్వయంగా ప్రభుత్వం చొరవచూపి తమను సన్మానించడం సంతోషంగా ఉందని చెప్పారు. పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన తర్వాత కొంత సమయం తీసుకుని పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించిందని వెల్లడించారు. దీని వెనుక ప్రధాని మోడీ వేసిన గొప్ప వ్యూహం ఉందని ఆయన వివరించారు. ఇలా కాస్త గ్యాప్ తీసుకుని అవార్డులు ప్రకటించడంతో పద్మశ్రీ పొందే వారి గురించి తెలుసుకునేందుకు కాస్త సమయం దొరుకుతుందని చెప్పారు.
ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయనపై తనకు మరింత గౌరవం పెరిగిందని వివరించారు. మరోవైపు నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చడం వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఎక్కడ కళాకారులు గౌరవింపబడుతారో అక్కడ రాజ్యం చాలా సుభిక్షంగా ఉంటుందని అన్నారు. రాజకీయాల్లో వెంకయ్యనాయుడు నిజమైన రాజనీతిజ్ఙుడు అని కొనియాడారు. వాజ్పేయి అంత హుందాతనం వెంకయ్యలో ఉందని తెలిపారు.
పద్మ విభూషన్ అవార్డు ప్రకటన చూసిన తనకు పట్టలేనంత ఆనందం కలిగిందన్నారు. తన అభిమానుల ఆశీర్వాదం చూస్తుంటే తన జన్మ ధన్యమైపోయిందనిపిస్తోందన్నారు. అభిప్రాయపడ్డారు. తమను సన్మానించిన ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు.