కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై బీజేపీ వేసిన గ్రాఫిక్ పోస్టర్ పై పీపుల్ డెమోక్రటిక్ పార్టీ (PDP)చీఫ్ మెహబూబా ముఫ్తి ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాల ఇండియా కూటమికి పెరుగుతున్న ఆదరణను చూసి బీజేపీ (BJP) “నిరాశ”లో ఉన్నట్లు కనిపిస్తోందని తెలిపారు. ఇండియా కూటమితో బీేపీ విసుగు చెందిందన్నారు. హిందూ ముస్లిం సహా బీజేపీ అన్ని వ్యూహాలు విఫలమయ్యాయని చెప్పారు.
బీజేపీ నేతలు ఎప్పుడూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతారని చెప్పారు. ప్రత్యర్థులను రావణుడు అని పిలవాలని మీ సనాతన ధర్మం నేర్పిందా? అంటూ ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న ముస్లిం నేతలను ఆ పార్టీ నేతలు కలుస్తారని అన్నారు. విదేశాల్లోని మసీదులను సందర్శిస్తారని పేర్కొన్నారు. కానీ ఈ దేశంలోని ముస్లింలపై మాత్రమే మూకదాడులు చేస్తారని పైర్ అయ్యారు.
అంతకు ముందు ఈ పోస్టర్ పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీని రావణుడితో పోలుస్తూ బీజేపీ పెట్టిన గ్రాఫిక్ పోస్టర్ ను ఖండించేందుకు తమ వద్ద మాటలు కూడా చాలడం లేదన్నారు. ఈ పోస్టర్ లో బీజేపీ దురుద్దేశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. రాహుల్ గాంధీని వాళ్లు హత్య చేయాలనుకుంటున్నారని ఆరోపించారు.
రాహుల్ గాంధీ తన నానమ్మ, తండ్రిని కోల్పోయారని గుర్తు చేశారు. చిన్న రాజకీయ కారణాల వల్ల రాహుల్ గాంధీకి ఎస్పీజీ భద్రతను తగ్గించారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీని రావణుడిగా చూపిస్తూ ఓ గ్రాఫిక్ పోస్టర్ ను బీజేపీ ట్వీట్ చేసింది. దానికి భారత్ ప్రమాదంలో ఉందని క్యాప్షన్ పెట్టింది. రాహుల్ గాంధీ ధర్మ వ్యతిరేకి అని, అతని లక్ష్యం భారత్ ను నాశనం చేయడమేనని పేర్కొంది.