ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు నేపథ్యంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti)ని పోలీసులు గృహ నిర్బంధం చేశారని పీడీపీ తెలిపింది. పోలీసులు ముఫ్తీ ఇంటికి చేరుకుని తలుపులకు తాళం వేశారని, అక్రమంగా గృహనిర్బంధం చేశారని పేర్కొంది. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించింది.
మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లాలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారని ఎన్సీ నేతలు వెల్లడించారు. ఉదయాన్నే తమ నేతల నివాసాలకు చేరుకుని వారికి ఇళ్లకు తాలాలు వేశారన్నారు. ఇది చాలా అవమానకరమైన విధానమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ ఆరోపణలపై జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ మిశ్రా స్పందించారు. ఆ పార్టీల ఆరోపణలను మిశ్రా ఖండించారు. ఒమర్ అబ్దల్లా, మెహబూబా ముఫ్తీలను గృహ నిర్బంధం చేశారనే ఆరోపణలు నిరాధారమైనవన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులు ఎవరినీ హౌస్ అరెస్టు గానీ అరెస్టు కానీ చేయలేదన్నారు.
ఇవి కేవలం వదంతులను ప్రచారం చేసి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు చేసిన వ్యాఖ్యలు అన్నారు. మరోవైపు గుప్కర్ రోడ్ ప్రవేశ ద్వారం వద్ద పోలీసు సిబ్బందిని భారీగా మోహరించారు. ఎన్సీ నాయకుల నివాసం వద్దకు వెళ్లేందుకు జర్నలిస్టులను పోలీసులు వెల్లడించలేదు.