పదేళ్లలోనే తెలంగాణ (Telangana) లో నూరేళ్ల అభివృద్ధి జరిగిందన్నారు మంత్రి హరీష్ రావు (Harish Rao). సిద్దిపేట (Siddipet) లో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో పాల్గొన్న హరీష్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా పాలకుల హయాంలో కన్నీళ్లు పెట్టిన తెలంగాణ పల్లెలు.. ఇప్పుడు కళకళలాడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అడుగు పెట్టగానే సగం రోగం నయమయ్యేలా అద్భుతాలను సాకారం చేసుకున్నామని చెప్పారు.
సిద్దిపేటకు ఐటీ హబ్ రావాలనే కల నెరవేరిందని.. స్థానిక యువతకు 1500 ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సాఫ్ట్వేర్సంస్థలు పని చేయాలని, వారికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. త్వరలో ఐటీ హబ్ ఫేస్-2 తీసుకురానున్నట్లు చెప్పారు. మంచి ట్రైనింగ్ ఇచ్చి కంపెనీలు విదేశాలకు మన విద్యార్థులను తీసుకెళ్లేలా పని చేయాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ (KCR) సారథ్యంలో నీళ్లు, నిధులు, నియామకాలను సాకారం చేసుకున్నామన్నారు హరీష్ రావు. అదే మార్గంలో సిద్దిపేటకు జిల్లా ఏర్పాటు, గోదావరి జలాలు, రైలు సౌకర్యాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఇవన్నీ స్వాతంత్య్ర దినోత్సవం రోజున చెప్పుకోవడం గర్వంగా ఉందన్నారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్లతో గోదావరి జలాలను జిల్లాలోని గ్రామ గ్రామాన పారించుకుంటున్నామని వివరించారు.
రైతు బీమాకు ఐదేళ్లు
రైతు బీమా పథకానికి ఐదేండ్లు పూర్తయిందని ట్వీట్ చేశారు హరీష్ రావు. ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఆగస్టు 15న దీన్ని ప్రారంభించారని చెప్పారు. అర్హులైన రైతులందరి తరఫున ప్రభుత్వమే ఎల్ఐసీకి ప్రీమియం చెల్లిస్తూ, ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ బాసటగా నిలుస్తోందని తెలిపారు. పథకం ప్రారంభించిన తొలి ఏడాది 31.25 లక్షల మంది రైతులు తమ పేరు నమోదు చేసుకోగా, 2023-24 నాటికి ఆ సంఖ్య 41.04 లక్షలకు పెరిగిందని వివరించారు. 2018లో రూ.602 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తే, ఇప్పుడు రూ.1,477 కోట్లు చెల్లిస్తున్నట్టు తెలిపారు హరీష్ రావు.