తెలంగాణా (Telangana) రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ (Congress-BJP) పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విద్యుత్ శాఖ మత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు.
ఒక పార్టీ ఐదు పాయింట్లు, ఆరు పాయింట్లు అంటూ ఏవేవో హామీలను ఇస్తుందని, మరో పార్టీ తెలంగాణా విమోచన దినోత్సవం పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. ఈ రెండు పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నాయని ఆరోపించారు.
తెలంగాణా విమోచన దినంపై ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, పాత గాయాల్ని రేపి లబ్ధి పొందాలని చూస్తున్నారని బీజేపీపై విమర్శలు చేశారు. దేశ మనుగడకు అటువంటి పార్టీలు ప్రమాదకరమని, వీటిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
అబద్ధపు హామీలు, మతం పేరుతో కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా వాటిని తిప్పి కొట్టే చైతన్యం తెలంగాణా ప్రజలకు ఉందని చెప్పారు. తెలంగాణా సమాజం చాలా చైతన్య వంతమైనదని అన్నారు. కాంగ్రెస్ చెప్పేవన్ని అబద్ధాలేనని, అందుకు నిదర్శనం వారి గత చరిత్రేనని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీలవన్ని పగటి కలలే అవుతాయని, వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ విజయం సాధించి, కేసీఆరే సీఎం అవుతారని అన్నారు. తెలంగాణాకి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓర్వలేకపోతున్నాయని, తెలంగాణా ప్రజలు కేసీఆర్ కి శ్రీరామ రక్షగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.