బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) నిప్పులు చెరిగారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అప్పుడే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉచిత కరెంట్ విషయంలో ఆలోచించి మాట్లాడాలంటూ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు.
అధికారం కోల్పోయిన షాక్లో కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. యాదాద్రి జిల్లాలో మంత్రి కోమటి రెడ్ వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ స్కీమ్లను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 40 రోజులే అయిందని గుర్తు చేశారు.
ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కేటీఆర్ అవాకులు చెవాకులు పేలుతున్నాడని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా బరాబర్ బీఆర్ఎస్ను బొంద పెడతామని కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి సొమ్ముతో 20 ఏండ్ల పాటు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తామంటూ మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. 100 రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు.