– కాంగ్రెస్ వి ముమ్మాటికీ..
– వారెంటీ లేని గ్యారెంటీలు
– అధికారంలో ఉన్నప్పుడు 200 ఇవ్వని కాంగ్రెస్..
– ఇప్పుడు 4వేలు ఎలా ఇస్తుంది?
– కోమటిరెడ్డి ఓవర్ చేస్తున్నారు
– ఏ టైమ్ లో అయినా వైర్లు ప్టటుకోవచ్చు
– కరెంట్ వస్తుందో.. లేదో తెలుస్తుంది
– అద్భుతాలు చేస్తున్న మాది వారసత్వ రాజకీయమే
– మోడీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వమైతే..
– మాది మహాత్మా గాంధీ వారసత్వం
– సూర్యాపేటలో మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ (Congress) పార్టీలో సీట్లు అమ్ముకుంటున్నారని.. ఒకవేళ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని ఎద్దేవ చేశారు కేటీఆర్ (KTR). సూర్యాపేట (Suryapet) జిల్లాలో పర్యటించిన మంత్రి.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సూర్యాపేటలో ఐటీ టవర్ ప్రారంభించి.. లబ్ధిదారులకు దళితబంధు చెక్కులు, డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా జగదీశ్ రెడ్డి విజయం ఆపలేరని పేర్కొన్నారు. సూర్యాపేటలో ఐదేళ్ల క్రితమే వైద్య కళాశాల పూర్తి చేసినట్లు గుర్తు చేశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkatreddy) కి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలని సవాల్ చేశారు కేటీఆర్. అప్పుడే ఎవరికి డిపాజిట్ వస్తుందో తెలుస్తుందన్నారు. ఆయన మరీ ఓవర్ గా మాట్లాడుతున్నారని.. 24 గంటల కరెంట్ వస్తుందో రావడం లేదో వైర్లు పట్టుకుని చూడాలని ఎద్దేవ చేశారు. ఎంతమంది వచ్చినా సరే.. బస్సులు మావే.. ఖర్చులు మావే.. ఏం టైంకు పోయినా ఓకే.. కరెంటు తీగలు పట్టుకోండి అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీవి ముమ్మాటికీ వారెంటీ లేని గ్యారెంటీలేనని విమర్శించారు.
ఆరు దశబ్దాలు పాలించినా ఏమీ చేయకుండా మళ్ళీ ఆరు గ్యారెంటీలు అంటూ డ్రామా చేస్తోందని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో దొరికి ఎమ్మెల్యే సీట్లు అమ్ముకునే వారి మాటలు నమ్మొద్దన్నారు. కేసీఆర్ హయాంలో కడుపు నిండా సంక్షేమం.. కంటి నిండా అభివృద్ధేనని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ చేసిన అభివద్ధి ఏమీ లేదని ఆరోపించారు. హస్తం పార్టీ హయాంలో కరెంట్ కావాలంటే ఏఈ, డీఈకి ఫోన్ చేసే పరిస్థితి ఉండేదని.. 3 గంటలకు మించి ఇవ్వలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు.
‘‘ప్రధాని మోడీ అన్నట్టుగానే మాది కుటుంబ పాలనే. అద్భుతాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీది వారసత్వ రాజకీయమే. మాది మహాత్మా గాంధీ వారసత్వం. మోడీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. మాది కుటుంబ పాలనే.. రైతులే మా కుటుంబం. తెలంగాణ ప్రజల వసుధైక కుటుంబానికి కేసీఆరే పెద్ద దిక్కు. మంత్రి జగదీష్ రెడ్డి చేసిన సేవ, అభివృద్ధికి 50వేల మెజార్టీతో గెలిపించాలి’’ అని ప్రజలను కోరారు కేటీఆర్.