– ప్రధాని వ్యాఖ్యలపై మరోసారి కేటీఆర్ స్పందన
– ట్విట్టర్ లో ఇంట్రస్టింగ్ పోస్ట్
– బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలను..
– గుర్తు చేసిన కేటీఆర్
బీఆర్ఎస్ (BRS) ను ఎన్డీఏ (NDA) లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రపోజల్ పెట్టారని ప్రధాని మోడీ (PM Modi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు వరుసగా మోడీ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ (KTR) పీఎం కామెంట్స్ ను ఖండించగా.. మరోసారి ట్విట్టర్(ఎక్స్)లో స్పందించారు. మేం బీజేపీ (BJP) ని అప్రోజ్ అవ్వడమేంటి.. 2018లో ఆపార్టీనే తమతో పొత్తుకు హింట్ ఇచ్చిందని అప్పటి బీజేపీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ లక్ష్మణ్ (Lakshman) చేసిన వ్యాఖ్యలకు సంబంధించి న్యూస్ క్లిప్స్ ను పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా పాత విషయాలను వివరించారు కేటీఆర్. తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తమతో పొత్తుకు ఎన్నో పార్టీల నుంచి వినతులు వచ్చాయని అన్నారు. కానీ, కేసీఆర్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదన్నారు. విపక్షాలు మాత్రం కేసీఆర్ (KCR) ను ఓడించేందుకు ఒక్కటయ్యాయని గుర్తు చేశారు. సైద్దాంతిక విభేదాలను పక్కనబెట్టి మరీ.. కలిసి పని చేశాయని తెలిపారు. ఆనాడు ఢిల్లీ బాస్ ల అనుమతి లేకుండానే లక్ష్మణ్.. పొత్తుకు సిద్ధమయ్యారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
బీజేపీ ప్రతిపాదనను బీఆర్ఎస్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తోసిపుచ్చిందని చెప్పారు కేటీఆర్. 105 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీతో బీఆర్ఎస్ ఎందుకు కలుస్తుందని అన్నారు. తాము ఫైటర్స్ అని.. చీటర్స్ తో ఎందుకు కలుస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంతంగా ఏర్పడే బలం తమకు ఉన్నప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఎందుకు తీసుకుంటామని అన్నారు కేటీఆర్.
మంగళవారం నిజామాబాద్ లో ప్రధాని మాట్లాడుతూ.. కేసీఆర్ గతంలో ఢిల్లీ వచ్చి తనను కలిశారని.. తెలంగాణ పాలన పగ్గాలు కేటీఆర్ కు ఇస్తానన్నారని చెప్పారు. ఆ సమయంలో ఇది రాజరికం కాదని.. తాను కేసీఆర్ కు గట్టిగా చెప్పానన్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికల్లో మద్దతివ్వాలని అడిగారని తెలిపారు. విపక్షంలోనైనా కూర్చుంటాం కానీ, మద్దతు ఇవ్వనని తెగేసి చెప్పినట్లు వెల్లడించారు. కేసీఆర్ కోరినా.. బీఆర్ఎస్ ఎన్డీఏలో చేరేందుకు తాను అంగీకరించలేదని అన్నారు మోడీ. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ వరుసగా విమర్శల దాడి చేస్తున్నారు. ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్లినా పచ్చి అబద్ధాలు మాట్లాడడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ డబ్బులు ఇవ్వడం ఏంటి.. చిన్న పిల్లలు కూడా నమ్మని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు కేటీఆర్.