సీఎం కేసీఆర్ (CM KCR) కు జ్వరం తగ్గకపోవడంతో అన్నీ తానై నడిపిస్తున్నారు మంత్రి కేటీఆర్ (KTR). వరుసగా జిల్లా పర్యటలను చేస్తున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూనే ఉన్నారు. శనివారం ఖమ్మం (Khammam) జిల్లాలో పర్యటించారు. అయితే.. నిరుద్యోగుల నుంచి ఆయనకు నిరసన సెగ తగిలింది. జీవో నెంబర్ 46 ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. మంత్రి కాన్వాయ్ ముందు ప్లకార్డులతో నిరసన తెలిపారు.
పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని.. ఇన్ని సంవత్సరాలైన ఎవ్వరికీ రాలేదని మండిపడ్డారు నిరుద్యోగులు. ఇక నుంచి అయినా తమ బాధలను ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేసిన కేసీఆర్ తర్వాత లకారం ట్యాంక్ బండ్ ను సందర్శించి ఎన్టీఆర్ (NTR) పార్కును ప్రారంభించారు. అక్కడే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ను స్టార్ట్ చేశారు. రామచంద్రయ్యనగర్ సహా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ పార్కులను ప్రారంభించారు.
చరిత్రలోని మహనీయుల స్థానంలో ఎన్టీఆర్ స్థానం పదిలంగా ఉంటుందని, ఆయన విగ్రహాన్ని, ఆయన పేరున ఉన్న పార్కుని ప్రారంభించడం తన అదృష్టమని కేటీఆర్ పేర్కొన్నారు. భారత దేశంలో తెలుగు వారంటూ ఉన్నారంటూ గుర్తించేలా చేసింది ఎన్టీఆరే అని అన్నారు. తారక రామారావు అనే పేరులోనే ఏదో శక్తి ఉందని.. ఆయన శిష్యుడు కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని యావత్ దేశానికి చాటి చెప్పారని వ్యాఖ్యానించారు.
దక్షిణ భారతావనిలో ఎన్టీఆర్ సహా ఎవరూ సీఎంగా హ్యాట్రిక్ కొట్టలేకపోయారని.. కానీ, కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలిచి రికార్డ్ క్రియేట్ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తద్వారా గురువు చేయలేని పనిని శిష్యుడు కేసీఆర్ సాధ్యం చేయబోతున్నారని వ్యాఖ్యానించారు. కొందరికి పదవులు వన్నె తెస్తే.. కొందరు పదవులకే వన్నె తెస్తారని అలాంటి వ్యక్తుల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయుడని కొనియాడారు కేటీఆర్.