– తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర సహకారం ఏది?
– మోడీ సహకరించకున్నా..
– జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకున్నాం
– ఉమ్మడి రాష్ట్రంలో 2 కాలేజీలే కట్టారు
– 9 ఏండ్లలో 28 మెడికల్ కాలేజీలు తెచ్చాం
– తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్, బీజేపీయే కారణం
– సిరిసిల్లలో ఒక్క రూపాయి పంచను..
– ఒక్క చుక్క మద్యం పంపిణీ చేయను
– ప్రజలకు తానేం చేసానో తెలుసన్న కేటీఆర్
అభివృద్ధి కొనసాగాలంటే తిరిగి కేసీఆర్ (KCR) ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు మంత్రి కేటీఆర్ (KTR). సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. సిరిసిల్లలో ఒక్క రూపాయి పంచను, ఒక్క చుక్క మద్యం పంపిణీ చేయను అని చెప్పానని.. దానికి కట్టుబడి వున్నానని అన్నారు. ఇక్కడి ప్రజలకు తానేం చేసానో తెలుసని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క డిగ్రీ కాలేజీ కోసం సిరిసిల్ల, వేములవాడ మధ్య గొడవ జరిగిందని గుర్తు చేశారు. 60 ఏండ్ల పాలనలో ఒక్క డిగ్రీ కాలేజ్ కోసం లొల్లి అయిందని తెలిపారు. కానీ, ఇప్పుడు డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. ప్రతీ వందమంది డాక్టర్లలో 43 మంది తెలంగాణలో తయారు అవుతున్నారని తెలిపారు. తాను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే స్థితి నుంచి సర్కార్ దవాఖానలో మాత్రమే ప్రసవం అయ్యే స్థితికి వచ్చామని వివరించారు.
ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) సహకరించకున్నా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు కేటీఆర్. ఈ తొమ్మిదేండ్లలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, వచ్చే సంవత్సరం మరో 8 అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ వెనకబాటుకు కారణమని అన్నారు. తిరిగి వారు అధికారం ఇవ్వమంటున్నారని అలా చేస్తే మళ్లీ ఆనాటి కష్టాలు చూడాల్సి వస్తుందని విమర్శించారు.
సిరిసిల్ల జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి.. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) వాళ్లు మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఎవరిని అడగాలి..? వాళ్లకు టికెట్లు కావాలంటే ఎవరిని అడగాలి..? ఢిల్లీ వాళ్లని అడగాలి.. మనకు అలాంటి పరిస్థితి లేదన్నారు కేటీఆర్. సిరిసిల్లలో నన్ను… వేములవాడలో చల్మెడ లక్ష్మీ నరసింహ రావును మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేసినందుకు సిరిసిల్ల జిల్లా రైతుల పక్షాన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.