సంస్కరణలతో వక్ర మార్గంలో తీసుకు వచ్చిందే ధరణి (DHARANI) అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy)అన్నారు. ధరణిలో సమస్యలు, సామాన్యులు పడుతున్న ఇబ్బందులు అన్ని కలిపి ప్రభుత్వ మార్పు జరగాలని ప్రజల్లో భావనను తీసుకు వచ్చాయన్నారు. ధరణిలో లొసుగులను, అందులో ప్రభుత్వం చేసిన తప్పులను ప్రక్షాళన చేసి సామాన్యులకు మేలు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు.
డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ….రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను గ్రామీణ స్థాయి నుంచి పటిష్టం చేయాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
గతంలో ఏ గ్రామంలోనైనా వీఆర్ఏ లేదా వీఆర్ఓ ఎవరో ఒకరు ఉండేవారని అన్నారు. కానీ గత ప్రభుత్వ పెద్దలు చేస్తున్న తప్పులను ఎక్కడ బయటకు లీక్ చేస్తారోనని ఆ వ్యవస్థనే పూర్తిగా నాశనం చేశారని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండేలా చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ధరణి అని ఒక పోర్టల్‌ను తీసుకొచ్చి ప్రజలను కొత్త ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు.
కొన్ని వందలేండ్లుగా భూములను కాపాడుతూ వచ్చిన ఆనాటి రెవెన్యూ ఉద్యోగులను కాదని తాతలు తండ్రులు కష్టపడి నిలబెట్టిన భూములను ధరణి అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వం తమ తొత్తులకు కట్టబెట్టిందన్నారు. ఎవరికైతే ఆ భూములను కట్ట బెట్టారో వాటిని రెవెన్యూ ఉద్యోగుల సహకారంతో పేద వారికి ఇచ్చేందుకు చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
సంస్కరణలు, మార్పులు అనేవి అవసరమని తెలిపారు. కానీ ఏ సంస్కరణలు తీసుకు వచ్చినా, ఎలాంటి మార్పులు చేసినా వాటిని కొద్ది మంది వ్యక్తుల కోసమే చేయవద్దని పేర్కొన్నారు. మనంత తీసుకొచ్చే చట్టాలు సామన్య ప్రజలకు మేలు చేయాలని వెల్లడించారు. సామాన్య ప్రజలకు, పేదవాడికి, గ్రామీణ ప్రాంతంలో ఉండే వ్యక్తులకు మనం చేసే సంస్కరణలు ఉపయోగపడాలని సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో వ్యక్తి స్వచ్ఛను హరించుకుపోయాయని తెలిపారు. అప్పట్లో ఏ ఉద్యోగి కూడా మాట్లాడే పరిస్థితి ఉండేది కాదన్నారు. ఎవరో ఒక్కరో ఇద్దరో తప్పు చేస్తే మిగతా ఉద్యోగులను ఇబ్బందులు పెట్టిన సందర్బాలు చాలా ఉన్నాయని అన్నారు. ఆనాడు 10-25 తేదీల వరకు కూడా ఉద్యోగులకు జీతాలు వచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, దోపిడీలు, భూకబ్జాలన్నింటికీ చెక్ పెట్టేందేందుకు ప్రభుత్వం చిత్త శుద్దితో పని చేస్తోందన్నారు.