రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక కేసుల్లో కేసీఆర్ (KCR) ఫ్యామిలీని బీజేపీ కాపాడిందని ఆయన ఆరోపించారు. ఇన్నాళ్లుగా కేసీఆర్ పై ఎందుకు విచారణకు ఆదేశించలేదన్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీకి బీజేపీ సహకరించాలని కోరారు. కేసీఆర్ ను రక్షించేందుకే ఇప్పుడు సీబీఐ విచారణ అంటున్నారని మంత్రి ఆరోపణలు గుప్పించారు.
రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యం అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకటేనన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా ఆమలు చేస్తామని వెల్లడించారు. మెహిదీపట్నం సర్కిల్ విజయనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ సెంటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ప్రజాపాలన దరఖాస్తుల పొడగింపు ఉండదని స్పష్టం చేశారు. అందువల్ల జనవరి 6లోగా అందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా కంటోన్మెంట్‌తో పాటు 650 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 9.92 లక్షల దరఖాస్తులను స్వీకరించామని మంత్రి వివరించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చినా ఇప్పుడున్న కౌంటర్ల కంటే అవసరం మేరకు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు. అర్హులైన నిరుపేదలకు పథకాలు అందుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజాపాలనలో భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు.