రజక, నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. సెలూన్లకు, లాండ్రి, ధోబీ ఘాట్ లకు విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్ చేయరని స్పష్టం చేశారు. ఈ విషయం గురించి ఎవరు అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పుండా అమలు చేస్తామని చెప్పారు.
మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…. ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి లాండ్రీలు, ధోబీ ఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. 36,526 మంది నాయి బ్రహ్మణ లబ్ధిదారులకు సంబంధించి రూ. 12.34 కోట్లు, 76,060 మంది వాషర్ మెన్ లబ్ధిదారులకు రూ. 78.55 కోట్లను డిస్కంల (జనవరి 3వరకు)కు బకాయిలు ఉన్నాయన్నారు.
ఆర్థిక శాఖ బడ్జెట్ను విడుదల చేయాలని బీసీ మంత్రిత్వ శాఖను కోరారని వెల్లడించారు. లాండ్రీలు, ధోబీ ఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లకు విద్యుత్ సరఫరాను నిలిపి వేయవద్దని మంత్రి ఆదేశించారు. ఇది ఇలా వుంటే సెలూన్లు, దోబీ ఘాట్లకు గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని నాయీబ్రాహ్మణ సేవా సంఘం కోరింది.
ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణతోపాటు పలువురు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను నాయీ బ్రాహ్మణ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నాయీబ్రాహ్మణ సమాజంతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ల సమస్యలపై చర్చిస్తామని హామీ ఇచ్చిన నాయీ బ్రాహ్మణ నేతలు వెల్లడించారు.