తాము అధికారంలోకి వచ్చిన రెండు రోజుల నుంచే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై బీఆర్ఎస్ (BRS) దూషణలు మొదలు పెట్టిందని పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క (Seethakka) మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇంట్లోని 5 ఉద్యోగాలు పోవడంతో వారి ఆటలు సాగడం లేదన్నారు. అందుకే కాంగ్రెస్ సర్కార్ పై బురద జల్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని వెల్లడించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో రాజరాజేశ్వర గార్డెన్స్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ ఎన్నికలపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ…. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని, పదవుల కుటుంబం కాదన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబం పదవులను అనుభవించిందని ధ్వజమెత్తారు.
ఆదిలాబాద్ జిల్లా అక్షరక్రమంలో ముందుండి అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉందని పేర్కొన్నారు. ఇది సరస్వతి దేవి కొలువైన ప్రాంతమని చెప్పారు. ఎందరో మహనీయులు పుట్టిన ప్రాంతం ఆదిలాబాద్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో ప్రేమ ఉందన్నారు. అందుకే సీఎం అయ్యాక ఇప్పుడు తన తొలి పర్యటనను రేవంత్ రెడ్డి ఇక్కడినుండే మొదలుపెడతారని వివరించారు.
ఈ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓడిన అభ్యర్థులు సైతం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుండలని సూచించారు.