బీఆర్ఎస్ (BRS) పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ (Talasani Srinivas). బుధవారం కాచిగూడలోని తుల్జా భవానీ ట్రస్టును సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు తావు లేదని మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పే ధైర్యం తమకుందని.. మీరేం చేశారో చెప్పగలరా? అని ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించారు తలసాని. బీజేపీకి అభ్యర్థులు లేరని.. కాంగ్రెస్ లో గొడవలే సరిపోతాయని సెటైర్లు వేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రజలు తిరిగి బీఆర్ఎస్ కు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ (KCR) దమ్మున్న నాయకుడు కాబట్టే.. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే అభ్యర్థులను ప్రకటించారని అన్నారు తలసాని. కాంగ్రెస్, బీజేపీలకు దమ్ముంటే వారం రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాలని సవాల్ విసిరారు. ఆ రెండు పార్టీల నేతలు ఎన్ని కుప్పిగంతులు వేసినా, బీఆర్ఎస్ గెలుపును ఆపలేరని అన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం పక్కా అని తెలిపారు.
మరోవైపు, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబుపై తలసాని దాడి చేయడాన్ని ఖండిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని నిర్మల్ జిల్లా లంబాడి జేఏసీ డిమాండ్ చేసింది. చర్యలు తీసుకోకపోతే గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించింది. మంత్రిని అరెస్ట్చేయాలంటూ కుభీరు గిరిజన నాయకులు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.