పత్తి కొనుగోళ్ల విషయంపై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI)కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageshwar Rao) లేఖ రాశారు. తెలంగాణలో పత్తి కొనుగోళ్ళను కొనసాగించాలని సీసీఐ మేనేజింగ్ డైరెక్టర్‌ను మంత్రి కోరారు. పత్తి కొనుగోళ్ల నుంచి సీసీఐ తప్పుకుంటే మార్కెట్ లో ధరలు తగ్గే ప్రమాదము ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వర్ష కాలంలో తెలంగాణలో మొత్తం 44.92 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని వెల్లడించారు. మొత్తంగా 25.02 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని తాము అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. గత 15 రోజులుగా ప్రపంచ మార్కెట్లో పత్తికి మంచి డిమాండ్ పెరిగిందని చెప్పారు. అందువల్ల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా కొనుగోళ్లను నిరాటంకంగా కొనసాగించాలని కోరారు.
అంచనాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 285 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. మొత్తం రూ. 8569.13 కోట్లు వెచ్చించి.. 12.31 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించామన్నారు. ప్రైవేట్ ట్రేడర్స్ ద్వారా మరో 4.97 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారన్నారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో పత్తి మూడవసారి ఏరివేత దశలో ఉందని చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో రైతుల వద్ద మొదటి, రెండవసారి తీసిన పత్తి మొత్తం కలిపి దాదాపు 71 లక్షల క్వింటాల వరకు ఉంటుందని వివరించారు. ఇలాంటి సందర్బంలో కొనుగోళ్ల నుంచి తప్పుకుంటే మార్కెట్లో ధరలు తగ్గే ప్రమాదము ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, పత్తి రైతులకు ఏ మాత్రమూ ఆహ్వానించదగ్గ పరిణామం కాదని పేర్కొన్నారు. ఒకవేళ ఒకటి లేదా రెండు సందర్భాల్లో పత్తి నాణ్యత ప్రమాణాలకు తగట్టుగా రాని ఎడల సీసీఐ ప్రమాణాల ప్రకారం ధరలను నిర్ణయించి కొనుగోలు చేయాలని సీసీఐని తెలంగాణ ప్రభుత్వం తరుపున విజ్ఞప్తి చేశారు.