కృత్రిమ మేధతో (AI) రూపొందించిన డీప్‌ఫేక్ కంటెంట్ (Deep Fake Content)తో పోలిస్తే తప్పుడు సమాచారం, అసత్య వార్తల ప్రచారం ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు అని కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. ఇటీవల డీప్ ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకు వచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తన ప్రాధాన్యతలను సరిగ్గా సెట్ చేయాలని అన్నారు. డీప్‌ఫేక్ వీడియోల వల్ల ప్రమాదకరమైన పరిణామాలు తలెత్తుతాయన్న విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. కానీ నిజం చెప్పాలంటే అసత్య ప్రచారం అనేది ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ముప్పు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారంపై సుప్రీం కోర్టు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. దానిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రియాంక్ ఖర్గే ప్రశ్నించారు. ఈ సమయంలో తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను పరిష్కరించడమే కర్ణాటక ప్రాధాన్యత అని ఆయన అన్నారు.
డీప్‌ఫేక్ మనందరికీ సవాలుగా మారనుందని చెప్పారు. ఇది ఖరీదైన వ్యవహారమని వెల్లడించారు. మనం ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందన్నారు. ఈ సమయంలో తప్పుడు సమాచారంపై పోరాడటం తమ ప్రాథమిక కర్తవ్యం అని స్పష్టం చేశారు. ఇటీవల డీప్ ఫేక్ వీడియోలను అడ్డుకట్ట వేసేందుకు సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమావేశం అయ్యారు.