ఐపీఎల్ (IPL) వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. ఈ వేలంలో పలువురు ఆటగాళ్లను రికార్డు స్థాయిలో బిడ్డింగ్ చేసి ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins)ను దక్కించుకునేందుకు సన్ రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీ పడ్డాయి. బిడ్డింగ్‌లో చివరకు బెంగళూరు సైడ్ కావడంతో పాట్ కమిన్స్ ను హైదరాబాద్ జట్టు ఎగురేసుకు పోయింది.
వేలం పాటలో కమిన్స్ కనీస ధరను మొదట రూ. 2 కోట్లుగా నిర్ణయించారు. కానీ వేలంలో కమిన్స్ కోసం అటు హైదరాబాద్, ఇటు బెంగళూరు పోటీ పట్టాయి. దీంతో వేలంలో కమిన్స్ ధర భారీగా పెరిగిపోయింది. చివరకు అత్యధికంగా రూ. 20.50 కోట్ల రికార్డు ధరతో సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. అసీస్ కెప్టెన్ ను పాట్ కమిన్స్ విషయంలో కావ్య మారన్ పట్టుదలగా ఉండటంతో బిడ్‌లో అత్యధిక ధరకు బిడ్ చేశారు.
ఈ క్రమంలో అత్యధిక రికార్డు ధర పొందిన ఆటగాడిన కమిన్స్ రికార్డు సృష్టించారు. దీంతో అంతా ఆశ్చర్య పోయారు. కానీ అంతలోనే అనూహ్యంగా కమిన్స్ రికార్డును ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బద్దలు కొట్టాడు. వేలంలో స్టార్ట్ ను కొనుగోలు చేసేందుకు కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించింది. స్టార్క్ ను ఏకంగా రూ. 24.75 కోట్లకు కోల్ కతా ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.
మొదట స్టార్క్ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించారు. స్టార్క్ కోసం అటు గుజరాత్ టైటాన్స్ ఇటు కోల్ కతా నైట్ రైడర్స్ పోటీ పడ్డాయి. చివరకు అత్యధిక బిడ్ చేసి స్టార్క్ ను కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఫేసర్ జోష్ హేజెల్ వుడ్‌ను దక్కించుకునేందుకు ఈ రోజు ఏ జట్టు ఫ్రాంచైజీ కూడా అంతగా ఆసక్తి కనబరచలేదు. దీంతో ఆయన అన్ సోల్డ్ గా మిగిలారు.
టీమిండియా సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌ను గుజరాత్ టైటాన్స్ చేజిక్కుచ్చుకుంది. ఉమేశ్ యాదవ్ పై రూ. 5.8 కోట్లతో గుజరాత్ టైటాన్స్ బిడ్ చేసింది. కరేబియన్ ఆటగాడు అల్జారీ జోసెఫ్‌ను రూ.11.5 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. టీమిండియా టెస్టు జట్టు వికెట్ కీపర్ కేఎస్ భరత్‌ను కనీస ధర రూ.50 లక్షలకే కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.