తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth reddy) ఎదుట బీఆర్ఎస్ పార్టీ కీలకనేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish rao) కీలక డిమాండ్‌ను ఉంచారు. రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు గాను పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎకరానికి రూ.10వేల నష్టపరిహారం (indemnity) చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాని కోరారు. ఉన్నట్టుండి రాష్ట్రంలో అకాల వర్షాలు (Sudden rains) కురుస్తున్నాయని ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున పంటకు నష్టం (Crop loss) వాటిల్లిందన్నారు.
ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేశాయని చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంట నష్టపోయి రైతులు బాధపడుతుంటే రాష్ట్ర సర్కార్ కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డికి అన్నదాతల గోడు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలను పార్టీలో చేర్చుకోవడం, గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం తప్పా సీఎం రేవంత్‌కు ఏమీ తెలియదన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. మొన్నటివరకు పంటలకు నీళ్లివ్వక అవి ఎండిపోతే రైతులు వాటికి అగ్గిపెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అప్పుడు కూడా ముఖ్యమంత్రి స్పందించలేదని, కనీసం వారికి అండగా ఉంటామని మాట్లాడలేదని తప్పుబట్టారు. అకాల వర్షాలతో పంటనష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని, అధికారులను క్షేత్రస్థాయిలో పంట నష్టంపై నివేదిక తయారు చేయించి ఈ మేరకు బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా హరీశ్ రావు డిమాండ్ చేశారు.