మేడ్చల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చామకూర మల్లారెడ్డి (Malla Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మరచిపోయి కాంగ్రెస్ (Congress) కు ఓటు వేశారని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ను ఆయన పులితో పోల్చారు. త్వరలోనే పులి బయటకు రాబోతోందన్నారు. ఇక అసలైన ఆట మొదలవుతుందని చెప్పారు. మల్కాజ్ గిరి గడ్డ బీఆర్ఎస్ అడ్డా అన్నారు.
మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ…పదేండ్ల తర్వాత ప్రజలు కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇచ్చారని చెప్పారు. కానీ కాంగ్రెస్ నేతలు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేక పోయారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటున ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారని వెల్లడించారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో అలా జరగబోదన్నారు.
ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ఎప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీ రామ రక్ష అని కొనియాడారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ లో అంతా యువ నేతలేనని, తాను కూడా యువకుడినే అంటూ వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో యుద్ధం చేయాలి… బీఆర్ఎస్ గెలవాలన్నారు.
బీఆర్ఎస్ లో ఐదు పదవులు ఉన్న ఏకైక నేత శంబిపూర్ రాజు అని చెప్పారు. శంబిపూరి రాజు వల్లే ఇన్ని సీట్లు గెలవడం సాధ్యమైందన్నారు. బీఆర్ఎస్ మంత్రి వర్గంలో తన పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలను గెలిపించింది తానేనన్నారు. హరీశ్ రావుకు కూడా ఈ సారి మరక అంటిందన్నారు.