బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (KCR) రేపు అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అనేక సర్వేలు చేయించిన ఆయన.. గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతారని ఆపార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఈక్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 90కి పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారని సమాచారం. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో అభ్యర్థుల జాబితాను కేసీఆర్ విడుదల చేస్తారని అంటున్నారు.
ఇప్పటికే టికెట్ల విషయంలో కొన్నిచోట్ల వివాదాలు నెలకొన్నాయి. దీంతో సీఎం మనసు దోచిన లీడర్లు ఎవరయి ఉంటారనే హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఎవరు పోటీ చేస్తారో తెలియదు కానీ.. తాను లేకున్నా పోటీలో ఎవరున్నా గెలిపించాలని ప్రజలను కోరారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని 10వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సంజయ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారో తెలియదన్నారు. ఎవరికి సీటు ఇచ్చినా బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ఇప్పుడు ఎన్నికల సమయం కాదని.. ఎమ్మెల్యే అయిన తర్వాత జగిత్యాలను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు.
కేసీఆర్ ఫస్ట్ లిస్ట్ ను ప్రకటిస్తున్న నేపథ్యంలో సంజయ్ చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఆయన టికెట్ విషయంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అధిష్టానం ఈసారి సంజయ్ కు టికెట్ ఇవ్వకపోవచ్చుననే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే, ఆయన ఇలా మాట్లాడారని కొందరు అంటున్నారు.