లోక్ సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ప్రసంగంపై బీఆర్ఎస్ వర్గాలు రగిలిపోతున్నాయి. తమ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఎదురుదాడి కొనసాగిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) స్పందిస్తూ.. పార్లమెంట్ లో అబద్దాలు మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. అవకాశం వచ్చినప్పుడు ప్రజల కోసం మాట్లాడాలి గానీ.. తిట్టడమే పనిగా పెట్టుకుంటారా? అని అడిగారు. తెలంగాణ కోసం ఒక మంచి మాట మాట్లాడలేదని.. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు.
కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టుకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్న కవత.. ఆఖరికి జాతీయ హోదా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అదే, మధ్యప్రదేశ్ లో ఉన్న ప్రాజెక్టుకు మాత్రం ఇచ్చారని.. ఇదెక్కడి న్యాయమని అడిగారు. ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయని చెప్పి రూ.22 వేల కోట్లు ఇచ్చారని.. పైగా, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు ఇచ్చామని అబద్ధాలు మాట్లాడాతున్నారని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల కరెంట్ వస్తుందో లేదో.. కరీంనగర్ బీజేపీ (BJP) ఆఫీస్ లేదా హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ కు వచ్చి కరెంట్ తీగలు పట్టుకోమని సెటైర్లు వేశారు.
ఇటు ఎంపీ అరవింద్ (Aravind) వ్యాఖ్యలపైనా కవిత స్పందించారు. ఆయన అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిజామాబాద్ లో పెన్షన్లకు రూ.4 వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ ఇలా వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. వీటన్నింటిలో బీజేపీది ఒక్క రూపాయి కూడా లేదన్నారు. నిజామాబాద్ కు ఇది కావాలని పార్లమెంట్ లో ఒక్కనాడు కూడా అరవింద్ మాట్లాడలేదని విమర్శించారు.