ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC KAVITHA)కు మరోసారి చుక్కెదురైంది. ఆమె జ్యుడీషియల్ రిమాండ్ (JUDICIAL REMAND) మంగళవారంతో ముగియగా.. ఇటీవల ఆమె దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలని ఆమె తరఫు న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి భవేజాకు విజ్ఞప్తి చేశారు.
అయితే, కవితకు బెయిల్ అప్పుడే ఇవ్వొద్దని, ఆమె రిమాండ్‌ను మరోసారి(Again) పొడగించాలని ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. కవిత బయటకు వస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తుందని, సాక్ష్యాలను సైతం తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ తరఫున లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న రౌస్ అవెన్యూ న్యాయస్థానం ఈడీ వాదనలతో ఏకీభవించింది.
దీంతో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను పక్కన బెట్టి..మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ పొడగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో కవితను అధికారులు తిహార్ జైలుకు తరలిస్తున్నారు. అయితే, కవితను మార్చి 15న అరెస్టు చేసిన ఈడీ అధికారులు రెండు సార్లు కస్టడీకి తీసుకుని విచారించారు.
ఇక గతనెల 26వ తేదీన న్యాయస్థానం ఆమెకు తొలిసారి జ్యుడీషియల్ రిమాండ్ విధించగా అధికారులు తిహార్ జైలుకు తరలించారు. నేడు మరోసారి ఆమెకు జస్టిస్ భవేజా మరోసారి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెల్లడించారు. అంతకుముందు కవిత కోర్టు అనుమతితో రెండు నిమిషాల పాటు తన భర్త అనిల్ కుమార్ , మామతో మాట్లాడిన విషయం తెలిసిందే.