కేసీఆర్ (KCR) అసాధారణమైన వ్యక్తి, ఇటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. మన తెలంగాణా (Telangana) కు అటువంటి మనిషి నాయకుడిగా దొరికాదు అని కల్వకుట్ల కవిత (Kalvakutlla Kavitha) అన్నారు. అలాంటి వ్యక్తిపై కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేస్తూ, తెలంగాణా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తోందన్నారు.
తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై కవిత విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ స్పీడ్‌ను కాంగ్రెస్ నాయకులు అందుకోలేకపోతున్నారని, ఆ పార్టీకి జాతీయ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీనే అని కవిత అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో కవిత ఈ కామెంట్స్ చేశారు.
కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని ఎప్పుడు చెబుతుంటాను.. కానీ కేసీఆర్ అంటే కైండ్ హార్టెడ్, కమిటెడ్ రెస్పాన్సిబుల్ లీడర్ అని కవిత…కేసీఆర్ పేరుకు కొత్త బాష్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అప్ డేట్ అవ్వని, అవుట్ డేటేడ్ పార్టీ అన్నారు. బీఆర్ ఎస్ పార్టీ పోడు పట్టాలు లబ్ధిదారులకు ఎప్పుడో ఇచ్చేస్తే…ఖార్గే వచ్చి మే అధికారంలోకి వచ్చాక పోడు పట్టాలు ఇస్తామంటున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదని, ఎక్కడికి వెళ్లినా ఆ పార్టీని తిరస్కరిస్తున్నారని చెప్పారు. అలాంటి పార్టీని జగిత్యాలలోనూ ఓడించాలన్నారు. తెలంగాణలో ఊహకందని అభివృద్ధి జరుగుతుంటే, దానిని చూసి ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయన్నారు.
తెలంగాణ ప్రజలకు గులాబీ పార్టీ శ్రీరామరక్ష అని, కేసీఆర్ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ కూడా ఉందన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని కోరారు.