రాష్ట్రంలో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలపై బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) స్పందించారు. విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా సూర్యూ పేట జిల్లాలో ఎస్సీ బాలికల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు.
కొన్ని రోజుల వ్యవధిలోనే ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు బలవన్మరణానికి పాల్పడ్డారని గుర్తు చేశారు. విద్యార్థులు ఎందుకు ఇలా వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వాన్ని కవిత ప్రశ్నించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఏం జరుగుతోందని ప్రభుత్వాన్ని నిలదీశారు.
పూర్తి స్థాయిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం వల్ల ఇలాంటి పలు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేకపోతోందని ఆమె విమర్శలు చేశారు. అందువల్ల తక్షణమే పూర్తిస్థాయి సంక్షేమ శాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడంపై ఆలోచనలు చేయాలని ప్రభుత్వానికి సూచనలు చేశారు.
సూర్యాపేట జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హోం సిక్ లీవ్స్ పై ఇంటికి వెళ్లిన పదో తరగతి విద్యార్థిని అస్మిక ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదవుతున్న అస్మిత తన ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది.