-ఒక నెంబర్ లాగా చూడకండి
–లక్ష్యాన్ని చేరుకోవాలి
-అదే శ్యాం ప్రసాద్ ముఖర్జీకి నివాళి
– ప్రధాని మోడీ
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 370 లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా బీజేపీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగానికి నివాళి అర్పిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) అన్నారు. బీజేపీ (BJP) పెట్టుకున్న 370 లోక్‌సభ స్థానాల లక్ష్యాన్ని పార్టీ కార్యకర్తలు కేవలం ఒక సంఖ్యలాగా కాకుండా జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నివాళిగా చూడాలని కోరారు.
న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. లోక్‌సభ ప్రచారాన్ని పేదల పక్షాన పని చేయడం, దేశాభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా మెరుగైన స్థితిని పెంపొందించుకోవాలనే ఆలోచనల ఆదారంగా ప్రచారం చేయాలని సూచించారు రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రతి బూత్ పరిధిలో అదనంగా మరో 370 ఓట్లు వచ్చేలా చూసుకోవాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
మొదటి సారి ఓటు హక్కు పొందిన ఓటర్లను సంప్రదించాలని కోరారు. 2014 కి ముందు దేశంలో ఉన్న పరిస్థితులు, బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఉన్న పరిస్థితులకు మధ్య వారికి వివరించాలని సూచించారు. ప్రతిపక్షాలు ప్రతికూల కథనాలతో ప్రచారం చేసుకుంటాయని కార్యకర్తలు వాటిని తిప్పి కొట్టాలని మోడీ సూచించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే వెల్లడించారు.
అనవసరం వివాదాలకు దూరంగా ఉండాలని క్యాడర్‌కు సూచనలు చేశారని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో చేసిన అభివృద్ధి పనులు, అవినీతి రహిత పాలనా, గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని తావ్డే అన్నారు.