మూడు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల్లో బీజేపీ (BJP) దూసుకు పోతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో అధికారాన్ని చేపట్టబోతోంది. ఈ మూడు ఎన్నికల్లో మోడీ చరిష్మా (Modi Charishma) బీజేపీకి మైలేజ్ పెంచింది. దీంతో ఈ విజయాల క్రెడిట్ ను ప్రధాని మోడీకే దక్కుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకు పోతోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు.
ఈ క్రెడిట్ అంతా ప్రధాని మోడీకే దక్కుతుందని ఆమె ట్వీట్ చేశారు. అటు మధ్యప్రదేశ్లో బీజేపీ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. దీనిపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ చేసిన ప్రచారం తమ పార్టీకి ప్లస్ గా మారిందన్నారు. మోడీ ప్రచారం తమ విజయానికి ఎంతో దోహద పడిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో డబుల్ ఇంజన్ సర్కార్ విజయవంతమైందన్నారు.
అటు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రధాని మోడీ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బీజేపీకి పట్టం కడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళల గౌరవానికి ప్రజలు ఓటు వేశారని తెలిపారు. ఇది ఇలా వుంటే పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బెంగాల్ రాజకీయాలపై ప్రభావితం చూపుతాయన్నారు.
ఈ మూడు రాష్ట్రాల్లో వచ్చింది కేవలం చిన్న అల మాత్రమేనన్నారు. బెంగాల్లో త్వరలో మోడీ సునామీ రాబోతోందన్నారు. బెంగాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలను చూడబోతున్నామని వెల్లడించారు. ఇక్కడి అవినీతి ప్రభుత్వానికి, కుటుంబ పార్టీలకు ప్రజలు చరమ గీతం పాడబోతున్నారని తెలిపారు. మూడు రాష్ట్రాల విజయాన్ని బెంగాల్ లో జరుపుకుంటామన్నారు.