మధ్యప్రదేశ్ (Madhya Pradesh) నూతన సీఎంగా మోహన్ యాదవ్ (Mohan Yadav) ఎన్నికయ్యారు. పార్టీ శాసనసభా పక్ష నేతగా ఆయన్ని పార్టీ సభ్యులు ఎన్నుకున్నారు. గతంలో ఆయన మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఉజ్జయిని దక్షిణ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇటీవల అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు తన పదవికి రాజీనామా చేశారు.
అసెంబ్లీ నూతన స్పీకర్‌గా ఆయన్ని ఎన్నుకోనున్నారు. మరోవైపు మాజీ ఆర్థిక మంత్రి జగదీశ్ దేవడా, మాజీ మంత్రి రాజేంద్ర శుక్లాను డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. రాజధాని భోపాల్‌లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ పరిశీలకులుకుగా హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు డీవీ శర్మ హాజరయ్యారు.
సీఎం అభ్యర్థి విషయంలో పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోహన్ యాదవ్ పేరును ప్రతిపాదించగా దానికి ఎమ్మెల్యేలంతా ఓకే చెప్పారు. నూతన సీఎంగా ఎన్నికైన మోహన్ యాదవ్ కు పార్టీ అధిష్టానం అభినందనలు తెలిపింది. మరోవైపు తనకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన పార్టీ అధిష్టానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తాను ఒక చిన్న నాయకుడినన్నారు. తనలాంటి నాయకుడికి ఇంత గొప్ప బాధ్యతలు అప్పగించినందుకు కేంద్ర, రాష్ట్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరి ప్రేమాభిమానాలతో తన భాద్యతలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. మోహన్ యాదవ్ కు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఆయన ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
మోహన్ యాదవ్ పదేండ్ల క్రితం రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2013లో తొలిసారి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. 2020లో అప్పటి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వంలో తొలిసారిగా మంత్రిగా పని చేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరుసగా మూడోసారి విజయం సాధించారు.