షహీద్ మౌల్వీ బాకీర్ (MOULVI MUHAMMAD BAQIR)…. గొప్ప జర్నలిస్టు (Journalist)… సమాజంలో సాంఘిక దురాచారాలు, అసమానతలపై కలాన్ని ఎక్కుపెట్టిన అక్షర యోధుడు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తన అక్షరాలతో ప్రజల్లో అవగాహన కల్పించిన పాత్రికేయ వీరుడు. సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటీష్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన మొదటి పాత్రికేయుడు బాకీర్.
1780 లో ఢిల్లీలో షహీద్ బాకీర్ జన్మించాడు. 1825లో ఢిల్లీ కళాశాలలో చేరాడు. ఆ తర్వాత 1828లో ఢిల్లీ కళాశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. 1843లో ఢిల్లీలో కశ్మీరీ గేట్ దగ్గర ఇమాంబరాను నిర్మించాడు. అక్కడ హిందూ, ముస్లింలు చర్చల్లో పాల్గొనే వారు. ఆ తర్వాత 1834లో మతపరమైన మ్యాగజైన్లు ముద్రించే వాడు. ఆ సమయంలో జర్నలిజం పట్ల ఆయనకు ఆసక్తి పెరిగింది.
1834లో ప్రెస్ యాక్ట్‌కు బ్రిటీష్ ప్రభుత్వం సవరణలు చేసి ప్రచురణలకు అనుమతి ఇచ్చింది. ఆ సమయంలోనే జర్నలిజంలోకి అడుగు పెట్టాడు. 1835లో ఢిల్లీ ఉర్దూ అక్‌బార్ అనే పత్రికను మొదలు పెట్టాడు. 21 ఏండ్ల పాటు నడిచిన ఈ పత్రిక ఉర్దూ పత్రికా రంగంలో ఓ మైలురాయిగా నిలిచి పోయింది. ఈ పత్రిక సహాయంతో సామాజిక సమస్యలతో పాటు ప్రజల్లో రాజకీయ అవగాహనను కల్పించాడు. విదేశీ పాలకులకు వ్యతిరేకంగా ప్రజలను ఏక తాటిపైకి తెచ్చాడు.
1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా చాలా ఆర్టికల్స్ రాశాడు. 4 జూన్ 1857 తన వార్తాపత్రికలో సిపాయిల తిరుగుబాటు గురించి హిందూ ముస్లిం ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఆయన ఓ ఆర్టికల్ రాశాడు. ‘ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ అవకాశం తప్పిపోతే ఎవరూ మనకు సహాయం చేయలేరు. బ్రిటిష్ పాలన నుండి బయటపడటానికి ఇది మనకు మంచి అవకాశం’అని పబ్లిష్ చేశాడు.
ఈ నేపథ్యంలో బ్రిటీష్ ప్రభుత్వం బాకీర్ పై కన్నెర్ర జేసింది. 14 సెప్టెంబర్ 1857న ఆయన్ని బ్రిటీష్ పోలీసులు అరెస్టు చేశారు. 16 సెప్టెంబర్ 1857న బాకీర్ ను ఓ ఫిరంగి మూతికి బ్రిటీష్ అధికారులు కట్టేశారు. మేజర్ విలియం ఎస్ ఆర్ హడ్సన్ అనే అధికారి ఆ పిరంగిని పేల్చాడు. దీంతో బాకీర్ మరణించారు ఇలా మౌల్వీ మొహమ్మద్ బాకీర్ భారత ఉపఖండంలో పత్రికా రంగంలో మొదటి అమరవీరుడు అయ్యాడు.