ప్రధాని మోడీ (PM Modi) తెలంగాణ పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్(ఎక్స్)లో ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు? బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు? పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు? అంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (Aravind) స్పందించారు.
- కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి 8 ఏండ్ల నుండి జాగా ఇయ్యకుండా ఏ మత్తులో ఉన్నావ్?
- పాలమూరు మాత్రమే కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కి కూడా డీపీఆర్ ఇయ్యమంటే ఐదేండ్ల నుండి ఇయ్యకుండా ఏడ జోగుతున్నవ్?
- పసుపు బోర్డు, మహిళా రిజర్వేషన్లు స్టంట్లు అంటివి కదా, మరి నీ చెల్లెందుకు సప్పట్లు కొట్టి సంబరాలు చేసుకుంది బిల్లు పాసైనంక?
ఇలా.. కేటీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ప్రశ్నలు వేశారు అరవింద్. అంతేకాదు, ముందు మీ ముగ్గురు కుటుంబ సభ్యులు మత్తులో కాకుండా, ఒక్కసారన్నా తెలివికొచ్చి సమన్వయపరచుకోండి అంటూ సెటైర్లు వేశారు. ఎప్పుడొస్తాయ్.. ఎప్పుడొస్తాయ్ అని ఊగుతున్నావ్ కదా.. మీ కుటుంబానికి రాజకీయ గత్తరొచ్చినప్పుడు అన్నొస్తాయ్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అరవింద్.
కేటీఆర్ ఏమన్నారంటే..?
‘‘పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర? మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు? మీ గుండెల్లో గుజరాత్ ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా? కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారు.. లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఐఆర్ ను ఆగం చేశారు. మా ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారు. దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారు’’ అంటూ విమర్శల దాడి చేశారు. మోడీ పదేళ్ల పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజల్నే కాదు.. 140 కోట్ల భారతీయులను మోసం చేశారని ఆరోపించారు.