తెలంగాణ (Telangana) లో ఎన్నికల ప్రచారానికి బీజేపీ (BJP) అగ్రనేతలు రాబోతున్నారని అన్నారు ఆపార్టీ ఎంపీ అరవింద్ (Aravind). కామారెడ్డి సహా ఆర్మూర్, కోరుట్ల.. ఇలా పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. హంగ్ వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని అన్నారు. కేసీఆర్ తో కలిసేది లేదని స్వయంగా ప్రధాని మోడీ ప్రకటించారని గుర్తు చేశారు.
ఎమ్మెల్సీ కవిత (Kavitha) భయపడి నిజామాబాద్ (Nizamabad) పార్లమెంట్ లోని ఏ అసెంబ్లీ స్థానం జోలికి రారని అన్నారు అరవింద్. ఈ సారి పసుపు రైతులు తనకే ఓటు వేస్తారని.. కవిత కోరుట్లలో పోటీకి వస్తా అంటే ఆహ్వానిస్తామన్నారు. అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఉంటుందో తనకు తెలియదని అదంతా కిషన్ రెడ్డి (Kishan Reddy) చూసుకుంటారని తెలిపారు. తెలంగాణకు కేంద్రం చేయాల్సింది అంతా చేసిందని.. అవినీతి ఆరోపణలు లేకుండా మోడీ తొమ్మిదేళ్ళ పాలన అందించారని చెప్పారు.
తెలంగాణలో కల్వకుంట్ల పాలన చూసి ప్రజలు విసుగు చెందారని అన్నారు ఎంపీ. ఈసారి తమకు ఎన్ని సీట్లు వచ్చినా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. 25 సీట్లు వచ్చినా.. 60 సీట్లు వచ్చినా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని దీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ను ఓడించేందుకు ప్రజలు నిర్ణయించుకున్నారని.. ప్రతి పథకంలో అవినీతి ఉందని ఆరోపించారు.
రాష్ట్రంలో 30 శాతం కమీషన్ల ప్రభుత్వం ఉందన్న అరవింద్.. తెలంగాణలో ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. వంద శాతం కాంగ్రెస్ బీఫాంలు కేసీఆరే పంచుతున్నారన్నారు. కాంగ్రెస్ కి డబ్బులు పంచేది ఆయనేనని.. పోరాడేది మాత్రం బీజేపీ అని తెలిపారు. పార్టీ ముఖ్య నేతలు అసెంబ్లీకి పోటీ చేస్తారని చెప్పారు.