దళిత బంధు పథకం బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల కోసమే పెట్టారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy). యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మండలాధ్యక్షుల నియమకం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యనేతలతో చర్చించి తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా చాడా భాస్కర్ రెడ్డిని నియమించినట్టు తెలిపారు. అలాగే, భువనగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సర్పంచ్ కృష్ణారెడ్డిని ఎంపిక చేసినట్లు చెప్పారు.
రానున్న ఆరు నెలలు వరుసగా ఎమ్మెల్యే, ఎంపీ, సర్చంచ్, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయన్నారు వెంకట్ రెడ్డి. ఈసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ (KCR) పాలనపై తెలంగాణ (Telangana) ఇచ్చిన కాంగ్రెస్ (Congress) పార్టీతో పాటు ప్రజలు విసిగిపోయారని అన్నారు. తాను తిరిగిన 30 గ్రామాల్లో సామాన్య ప్రజలకు దళిత బంధు, బీసీ బంధు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రభుత్వ డబ్బుతో ఓట్ల కొనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఔటర్ రింగ్ రోడ్డు అమ్మి బీఆర్ఎస్ కార్యకర్తలకు దళిత బంధు, బీసీ బంధు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు కోమటిరెడ్డి. లక్ష కోట్లు వచ్చే ఔటర్ రోడ్డును రూ.7 వేల కోట్లకే అమ్మేశారని.. 40 ఏళ్ల క్రిందట ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు అమ్మితే రూ.6వేల కోట్లు వచ్చాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 40శాతం కూడా రుణమాఫీ పూర్తి కాలేదన్నారు.
ఆలేరు, భువనగిరిలో పాడి పరిశ్రమల బకాయిలు తీర్చలేదన్న వెంకట్ రెడ్డి.. మూడేళ్ల బకాయిలు అలాగే ఉన్నాయని తెలిపారు. ఈ నెల 17న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ విజయభేరీని విజయవంతం చేయాలని కోరారు. ఈ సభలో సోనియా గాంధీ 5 పథకాలను ప్రకటించబోతున్నారని.. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.