వచ్చే ఎన్నికల్లో వైసీపీ (YCP) గెలుపు కోసం ప్రతీ ఒక్కరు కష్టపడాలని అన్నారు ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి (Vijayasai Reddy). తిరుపతి (Tirupati) జిల్లాలో సత్యవేడు, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల నేతలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లంచాలు తినేసి కంచాలు మోగిస్తారా అంటూ టీడీపీ (TDP) నాయకులపై మండిపడ్డారు. బకాసురుడిలా తినేసి శ్రీకృష్ణుడు వేషం వేస్తారా? అని సెటైర్లు వేశారు.
సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరించిన తర్వాతనే చంద్రబాబు (Chandrababu).. ప్రైమ్ నిందితుడిగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారన్నారు. ‘‘ఎవరి కోసం కంచాలు మోగిస్తారు, విజిల్స్ వేస్తారు. స్కిల్ స్కాంలో అడ్డంగా దొరికిపోయిన బాకసురుని కోసమా? మేము రూ.2.35 లక్షల కోట్లు సంక్షేమ పథకాలు కింద అందిస్తే, చంద్రబాబు హయాంలో కేంద్ర నిధులు దోచేశారు’’ అంటూ మండిపడ్డారు. చట్టాలను అపహస్యం చేస్తున్నారని.. టీడీపీ నేతలు రాజ్యాంగం, చట్టం అంటే గౌరవం లేని సంఘ విద్రోహులు అని ఆరోపించారు.
రెండు వారాలుగా లోకేష్ ఢిల్లీలో దాక్కున్నాడని, ఈడీ, రాష్ట్రపతి, పీఎం ఆఫీసుల ముందు కంచాలు మోగించాలని సెటైర్లు వేశారు విజయ సాయిరెడ్డి. హెరిటేజ్ లో కుంభకోణం గురించి తాము మొదటి నుంచి చెప్తున్నామన్నారు. కొంతమందిని విచారించి, ఒక నిర్ధారణకు వస్తామని..అప్పుడు అన్నీ బయటకు వస్తాయని తెలిపారు. విజయ దశమి నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పట్నం నుంచి పాలన చేస్తారని తెలిపారు.
భూ కుంభకోణం, స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు సిద్ధ హస్తుడని విమర్శించిన విజయసాయి.. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. గతం కంటే ఎక్కువగా స్థానాలు సాధించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఐదారు లక్షల కోట్లు ఆస్తులు కూడా బెట్టారని, గత 14 ఏళ్ల పాలనలో ఆయన ఎంత అవినీతి చేశారనేది బయటకు రావాలని అన్నారు విజయ సాయిరెడ్డి.