పార్లమెంట్‌లో రచ్చ కొనసాగుతోంది. పార్లమెంట్(Parliament)లో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయాలంటూ కేరళ కాంగ్రెస్ (మణి), సీపీఎం (CPM)ఎంపీలు నిరసనకు దిగారు. దీంతో లోక్ సభలో ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ నేత థామస్ చాకీదాన్, సీపీఎం ఎంపీ అరిఫ్ ను స్పీకర్ సస్పెండ్ (Suspend) చేశారు. లోక్ సభలో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 97కు చేరుకుంది.
శీతాకాల సమావేశాలు ముగిసే వరకు ఇద్దరు ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పటి వరకు పార్లమెంట్‌లో మొత్తం 143 మందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఉపరాష్ట్రపతిని అనుసరిస్తూ టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను ఖండిస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. మరోవైపు ఉపరాష్ట్రపతికి ప్రధాని మోడీ ఫోన్ కాల్ చేశారు.
టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తీరును బీజేపీ ఎంపీలు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఘటనను తప్పుబడుతున్నట్టు చెప్పారు. విపక్షాల ఎంపీలు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను పదే పదే అవమానిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. గత 20 ఏండ్లుగా ప్రధాని మోడీ ఇలాంటి అవమానాలే ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఉపరాష్ట్రపతిపై గౌరవంతో విపక్ష ఎంపీల చర్యలకు నిరసనగా ప్రశ్నోత్తరాల సమయంలో నిలబడే ఉంటామన్నారు. ఈ మేరకు సభలో కాసేపు ఎంపీలంతా నిల్చుండే ఉండటంతో రాజ్యసభ చైర్మన్ స్పందించారు. ఎంపీల సంఘీభావం తమ మనసును తాకిందన్నారు. అందువల్ల ఎంపీలంతా కూర్చోవాలని కోరుతున్నానన్నారు. ధన్ ఖర్ కోరక మేరకు ఎంపీలంతా సీట్లలో కూర్చున్నారు.
ఉపరాష్ట్రపతిని టీఎంసీ ఎంపీ అనుకరించిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. ఎంపీలంతా పార్లమెంట్ ఆవరణలో కూర్చున్నారని, ఆ సమయంలో తాను ఫోటోలు తీశానన్నారు. ఆ వీడియో తన ఫోన్ లోనే ఉందన్నారు. ఎవరు ఎవరిని అవమానించారని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ నుంచి సుమారు 150 మంది ఎంపీలను బయటకు పంపించారని అన్నారు. దానిపై ఎలాంటి చర్చ జరగడం లేదన్నారు. మిమిక్రీ గురించి మాట్లాడుతున్న మీడియా సంస్థలు కొన్ని వార్తలను చూపించాలన్నారు అది వారి బాధ్యత అని పేర్కొన్నారు.
ఇది ఇలా వుంటే సస్పెండ్ అయిన ఎంపీలంతా జంతర్ మంత్ వద్ద మాక్ పార్లమెంట్ నిర్వహించనున్నారు. ఇందులో ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా స్పీకర్ గా పని చేయనున్నారు. సస్పెండ్ అయిన ఎంపీలంతా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. నిరసనలకు సంబంధించి మల్లికార్జున ఖర్గే తుది నిర్ణయం తీసుకోనున్నారు.