గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చిన్నారులను కిడ్నాప్ చేసే ముఠాలు ప్రవేశించాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.. ఈక్రమంలో హనుమకొండ (Hanmakonda), నిజామాబాద్ (Nizamabad), సిద్ధిపేట (Siddipet), వరంగల్ (Warangal), కామారెడ్డి సహా పలు జిల్లాల్లో పిల్లల కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయన్న వార్తలు వైరల్ కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఇక చిన్న పిల్లలను కిడ్నాప్ పై సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తల్లిదండ్రులే పిల్లలను స్వయంగా స్కూళ్లలో దింపి.. సాయంత్రం వారే ఇంటికి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనపడితే చాలు జనం వారిపై దాడికి పాల్పడుతున్న సంఘటనలు సైతం జరుగుతున్నాయి.
ఇలాంటి ఘటనే ములుగు (Mulugu) జిల్లాలో చోటుచేసుకుంది. పట్ణణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఓ వ్యక్తిపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. తీరా అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే.. అమాయకుడని తెలిసింది. ఈ మేరకు పోలీసులు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు. మరోవైపు పిల్లల కిడ్నాప్ కు సంబంధించిన వీడియోలు ఫేక్ అని.. వీడియోల్లో కొన్ని పాతవని క్లారిటీ ఇచ్చారు.
కాగా ఇలాంటి ఘటనల్లో నిజాలు గ్రహించకుండా దాడికి పాల్పడుతుండటం వల్ల.. ప్రాణాలు కూడా కోల్పోయిన వారున్నారు.. కాబట్టి ఎవరి మీద అయిన అనుమానం వస్తే.. ముందుగా పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో చేసే దాడుల్లో అమాయకులు మరణిస్తే కేసులు నమోదవుతాయని వెల్లడిస్తున్నారు..