ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ (Badruddin Ajmal) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం వర్గాల్లో క్రైమ్ రేటు ఎక్కువగా ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. జైళ్లకు వెళ్లడంలో కూడా ముస్లింలు నెంబర్ 1గా వున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
లూటీలు, దోపిడీలు, లైంగికదాడి వంటి నేరాలకు పాల్పడటంలో ముస్లింలు మొదటి స్థానంలో ఉన్నారని చెప్పారు. తాను తప్పేమీ చెప్పలేదని అన్నారు. కేవలం చదువు లేక పోవడంతోనే ముస్లింలు అధికంగా నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజంలో నిరక్షరాసత్య ఎక్కువగా ఉనన విషయాన్ని తాను గమనించానన్నారు.
తమ పిల్లలు చదవుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది ఉన్నత విద్యకు దూరంగా ఉంటున్నారని వెల్లడించారు. కనీసం మెట్రిక్యులేషన్ కూడా పూర్తి చేయలేకపోతున్నారని వాపోయారు. యువతకు విద్య ఆవశ్యకతను వివరించేందుకే తాను ఇలా చెబుతున్నానని బద్రుద్దీన్ అజ్మల్ వివరణ ఇచ్చారు.
యువకులు, పురుషులు బహిరంగ ప్రదేశాల్లో అమ్మాయిలను చూసేటప్పుడు, వారితో సంభాషించేటప్పుడు ఎలాంటి దురుద్దేశంతో ఉండరాదన్నారు. బయట మహిళలను చూసేటప్పుడు తమ కుటుంబాల్లో కూడా మహిళలు ఉన్నారని యువత గుర్తుంచుకోవాలన్నారు. తమ తల్లులు, సోదరీమణులను గుర్తు చేసుకుంటే లైంగిక వేధింపులకు పాల్పడరని పేర్కొన్నారు.