ఇటీవల ‘బలగం’(Balagam) సినిమాలో బావ బామ్మర్థుల మధ్య జరిగే గొడవ అందరికీ గుర్తుండే ఉంటుంది. అల్లుడికి మూలుగ బొక్క(Mutton Bone) వేయకపోవడంతో బావ, బామ్మర్థుల మధ్య గొడవ మొదలవుతుంది. ఆ కుటుంబంలో కలహాలకు దారితీస్తుంది. అచ్చం అలాంటి ఘటనే జగిత్యాల(Jagtial) జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.
జగిత్యాల జిల్లా(Jagtial District) మెట్పల్లి(Metpally) మండలానికి చెందిన అబ్బాయికి, నిజామాబాద్ (Nijamabad) జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబాలకు కట్న కానుకలు మాట్లాడుకోవడం అంతా సాఫీగానే సాగింది. నవంబర్ మొదటి వారంలో పెళ్లి కూడా నిశ్చయించారు.
అయితే అబ్బాయి తరఫు బంధువులు మూలుగ బొక్క విషయంలో గొడవకు పడ్డారు. చివరికి వారి గొడవ పోలీస్స్టేషన్ వెళ్లే వరకూ దారితీసింది. స్టేషన్లో పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. చివరికి పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశమైంది.
పెళ్లిళ్లలో చిన్నచిన్న గొడవలు జరగడం సాధారణం. అయితే, అమ్మాయి జీవితం ఏమవుతుందనే ఆలోచన లేకుండా విచక్షణ కోల్పోయి ఇలా మొండిగా వ్యవహరించడమేంటని పలువురు అభిప్రాయపడుతున్నాయి.