Telugu News » Congress : రాహుల్ తో మైనంపల్లి భేటీ.. మెదక్ కాంగ్రెస్ లో చిచ్చు!

Congress : రాహుల్ తో మైనంపల్లి భేటీ.. మెదక్ కాంగ్రెస్ లో చిచ్చు!

మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ చేరిక సందర్భంగా మెదక్ కాంగ్రెస్ లో చిచ్చు రేగింది. మల్కాజ్ గిరితోపాటు మెదక్ స్థానాన్ని మైనంపల్లి కుటాంబానికి అప్పగించింది అధిష్టానం.

by admin

– హస్తం గూటికి మైనంపల్లి, వీరేశం
– రాహుల్ గాంధీతో ప్రత్యేక భేటీ
– పార్టీ గెలుపు కోసం కష్టపడతామన్న నేతలు
– కుమారుడి కోసం మెదక్ టికెట్..
– ఫిక్స్ చేసుకున్న మైనంపల్లి
– ఇప్పటికే కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ప్రచారం
– భట్టికి జిల్లా నేతల కంప్లయింట్
– తిరుపతిరెడ్డికే టికెట్ ఇవ్వాలని పట్టు
– నకిరేకల్ లోనూ సేమ్ సీన్

పలు చర్చలు, అనేక కండిషన్ల అనంతరం.. ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేరారు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanmantarao) ఆయన కుమారుడు రోహిత్ (Rohith). వీరితోపాటు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula veeresam) కూడా హస్తం కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Kharge) సమక్షంలో వీరంతా కాంగ్రెస్ లో చేరారు. శుక్రవారం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi)తో వీరు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రేవంత్ రెడ్డి (Revanth Reddy), మాణిక్ రావు థాక్రే (Manik Rao Thakrey) సహా పలువురు పాల్గొన్నారు.

mynampally congress

కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా మైనంపల్లి, వేములకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు చెప్పారు. పార్టీ అభివృద్ధికి, వచ్చే ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలని సూచించారు. దీనికి సరేనన్న నేతలు.. తమ శాయశక్తులా కష్టపడతామని స్పష్టం చేశారు. అయితే.. మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ చేరిక సందర్భంగా మెదక్ కాంగ్రెస్ లో చిచ్చు రేగింది. మల్కాజ్ గిరితోపాటు మెదక్ స్థానాన్ని మైనంపల్లి కుటాంబానికి అప్పగించింది అధిష్టానం. ఈ ఒప్పందంతోనే ఆయన హస్తం గూటికి చేరారు. అలాగే, మేడ్చల్ స్థానాన్ని కూడా గెలిపించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో అధిష్టానం అన్నింటికీ సరేనని తల ఊపేసింది.

mynampally congress

మెదక్ టికెట్ కోసం డీసీసీ ప్రెసిడెంట్​ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన్ను కాదని మధ్యలో వచ్చిన మైనంపల్లి రోహిత్ కు టికెట్ ఇస్తామని ఒప్పందం చేసుకోవడంపై జిల్లా నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిరెడ్డికే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ కాంగ్రెస్​ నాయకులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో కాంగ్రెస్​ బలోపేతానికి కృషి చేసిన తిరుపతి రెడ్డికే టికెట్​ ఇవ్వడం సమంజసమని చెప్పారు. దీంతో ఏం జరుగుతుందో అనే గందరగోళం నెలకొంది.

ఇక, నకిరేకల్ నియోజకవర్గంలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. వేముల వీరేశం పార్టీలో అయితే చేరారు గానీ టికెట్ కన్ఫామ్ అనే విషయం బయటకు రాలేదు. ఈయన చాలా రోజుల క్రితమే చేరాల్సి ఉండగా.. టికెట్ ఓకే అనుకున్నాకే చేరాలని డిసైడ్ అయ్యారని.. ఇప్పుడు కన్ఫామ్ అయింది కాబట్టే జాయిన్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి నకిరేకల్ కాంగ్రెస్ లో నాయకత్వ లేమి ఉంది. 2018 శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి మారడంతో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ స్థానిక నాయకత్వం లేకుండా పోయింది. పలువురు కాంగ్రెస్ నాయకులు చిరుమర్తి వెంటే కాంగ్రెస్ ను వీడి గులాబీ కండువాలు కప్పుకున్నారు.

నకిరేకల్ కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయాలని భావిస్తున్న నాయకుల సంఖ్య కూడా భారీగానే ఉంది. జానారెడ్డి అనుచరునిగా ఉన్న కొండేటి మల్లయ్య, కోమటిరెడ్డి అనుచరునిగా ఉన్న దైద రవీందర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులు ఉన్న ప్రసన్న రాజుతో పాటు సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య తనయుడు శ్రీధర్.. వీరందరూ కాకుండా తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన చెరుకు సుధాకర్ భార్య లక్ష్మి.. వీరంతా కాంగ్రెస్ నుంచి టికెట్ పై ఆశలు పెట్టుకున్న వారే. అయితే.. ఇప్పుడు వీరేశం ఎంట్రీతో వీరి ఆశలపై నీళ్లు జల్లినట్లైంది. బీఆర్ఎస్ నాయకత్వంతో విభేదించి కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్న వీరేశానికే టికెట్ దక్కుతుందని.. కన్ఫామ్ అనుకున్నాకే ఆయన చేరారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు, అసంతృప్తిలో ఉన్న నేతల్ని అధిష్టానం ఎలా బుజ్జగిస్తుందో అనేది హాట్ టాపిక్ గా మారింది.

You may also like

Leave a Comment