ఎమ్మెల్యేల కొనుగోలు (MLA Poaching) కేసు నిందితుడు నంద కుమార్ (Nanda Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కావాలనే తనను ఇరికించారని తెలిపారు. తనపై కక్ష కట్టి ఉద్దేశ పూర్వకంగా తనను ఇరికించి బిజినెస్ దెబ్బ తీశారని అన్నారు. తనకు సింహయాజులు స్వామీజీని దాసోజు శ్రావణ్ పరిచయం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు.
ఫార్మ్ హౌస్‌లో జరిగిన విషయాలను త్వరలోనే బయటపెడతానన్నారు. గన్ పార్క్ వద్ద నంద కుమార్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనను ఇరికించాలని చూశారని వెల్లడించారు. ఈ కేసులో తాను నిందితుడినా లేదా బాధితుడినా అనే విషయం త్వరలోనే తెలుస్తుందన్నారు. తనను అక్రమ కేసులతో పోలీసులు వేధించారని ఆరోపించారు.
తనను జైలు నుంచి బయటకు రాకుండా చేశారన్నారు. తాను జైల్లో ఉన్న సమయంలో సినీ పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు తనకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తన హోటల్ ను అక్రమంగా కూలగొట్టారని మండిపడ్డారు. తన కుటుంబాన్ని రోడ్డున పడేశారని వాపోయారు. తనకు ప్రాణహాని ఉందన్నారు. తనపై నమోదైన అన్ని కేసులపై దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. త్వరలోనే సీఎం, డీజీపీని కలుస్తానన్నారు.
గతేడాది మొయినాబాద్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సంచలనం రేపింది. గతేడాది అక్టోబర్ 26న బీజేపీలో రావాలంటూ తనతో పాటు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావులను కొందరు ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఫాం హౌస్ పై మొయినాబాద్ పోలీసులు దాడి చేసి రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను అరెస్టు చేశారు.