నందలాల్ బోస్ (Nandalal Bose).. భారత్‌లోని గొప్ప చిత్ర కారుల్లో ఒకరు. ఆయన పెయింటింగ్ (Painting)లో భారతీయ సంస్కృతి, దేశ విషయాలను అందంగా ప్రదర్శిస్తుండే వారు. సుమారు 7వేలకు పైగా అత్యద్భుతమై చిత్రాలను ఆయన గీశారు. భారత రాజ్యాంగంలోని ప్రతి పేజీని తన చిత్రాలతో అత్యద్భుతంగా తీర్చి దిద్దిన గొప్ప ఆర్టిస్ట్. ఆయనలోని కళాత్మకతను గమనించిన భారత ప్రభుత్వం భారత్ రత్న, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ ‘ఎంబ్లమ్’డిజైన్ చేసే బాధ్యతను ఆయనకు అప్పగించింది.
1882 డిసెంబర్ 3న బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో నందన్ లాల్ బోస్ జన్మించారు. తల్లి క్షేత్రమోని దేవి, తండ్రి పూర్ణచంద్రబోస్. చిన్నప్పటి నుంచి పెయింటింగ్‌పై నందలాల్ బోసుకు మంచి ఆసక్తి ఉండేది. చిన్న తనంలో తన తల్లి క్షేత్రమణి దేవీ చేసిన మట్టి బొమ్మలతో ఆడుకుంటున్న సమయంలో వాటిని చూస్తు చిత్ర కళపై ఆసక్తి పెంచుకున్నాడు.
1905 నుంచి 1910 వరకు కలకత్తా ప్రభుత్వ కళా కళాశాలలో అబనినాథ్ ఠాగూర్ దగ్గర శిష్యునిగా పాఠాలు నేర్చుకున్నారు. అనంతరం 1922 నుండి 1951 వరకు శాంతినికేతన్‌లో కళా భవన్‌కు ప్రిన్సిపాల్‌గా పని చేశారు. గవర్నమెంట్ ఆర్ట్ స్కూల్‌లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికీ దాన్ని వదలుకుని అబనినాథ్ ఠాకూర్ దగ్గర సహాయకునిగా ఉన్నారు.
శాంతినికేతన్‌లో పని చేస్తున్న సమయంలో నందన్ లాల్ ను ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ కలిశారు. అప్పుడే రాజ్యాంగాన్ని అందమైన పెయింటింగ్స్ తో అద్బుతంగా తయారు చేయాలని నందలాల్ బోస్ ను ప్రధాని కోరారు. ఈ మేరకు భారత రాజ్యాంగాన్ని తన అద్బుతమైన చిత్రాలతో అందంగా మలిచారు. ఆ తర్వాత 1976లో బోసు పెయింటింగ్స్ ను ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించింది. వాటిని కేవలం పురాతన వస్తువులుగా కాకుండా ఒక గొప్ప కళా సంపదగా పరిగణించాలని సూచించింది.